ఒంటరి ఏకాంతం

కొట్టం రామకృష్ణారెడ్డి

సికింద్రాబాద్‌ నుంచి అయిదుంపావుకి గోదావరి, అరగంట ముందే చేరుకున్నాను స్టేషన్‌కి, టికెట్స్‌ అన్నీ ముందే ఆన్‌లైన్లో రిజర్వ్‌ చేసు కున్నాను కాబట్టి ఫరవాలేదు.
అయినా ఇదేమైనా కొత్తా? గత ముప్పై అయిదేళ్ల నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏటా ప్రయాణిస్తున్న రెగ్యులర్‌ ప్రయాణీకు డిని. క్రిక్కిరిసిన జనాలని తప్పుకుంటూ, తప్పించుకుంటూ ఆల్పాÛ హోటల్లో టీ తాగి బయటికొచ్చాను. అరటిపళ్లు, నీళ్ల బాటిల్‌ కొని ప్లాట్‌ఫావ్‌ు పైకి అడుగుపెట్టాను.
ఇంకో పావుగంట టైముంది రైలు కదలడానికి, నేనెక్కాల్సిన ఎస్‌3 కోచ్‌ ముందు నిల్చుని చుట్టూ పరికించాను. ఇంతమంది ఎందుకు రోజూ ఇలా పరుగులు పెడుతూ ప్రయాణిస్తూంటారు. అందరూ అవసరార్థమే ప్రయాణిస్తారు.
ఏ అవసరాలు ఇలా పరుగులు పెట్టిస్తాయి? ఎక్కడికి ఏ ప్రయాణం చేసినా, చివరికి ఇంటికే కదా చేరుకునేది!
కానీ, నాలాగా ప్రయాణించేది కేవలం నేనొక్కడినే. ప్రతి ఏటా తప్పని ప్రయాణం, తిరుగు ప్రయాణం అయ్యేవరకు ఉత్కంఠను రేకెత్తించే ప్రయాణం. ప్రతి సంవత్సరం ఈ ప్రయాణం మానెయ్యాలనే ప్రయత్నం, మానలేను. ఆమెను కలవకుండా ఉండలేను. నేను వెళ్లకపోతే, నానా యాగీ చేస్తుంది. నా లోలోకి దూసుకొచ్చి ఊపిరి ఆడకుండా చేస్తుంది. స్థిమితంగా కూర్చోనివ్వదు, నిల్చోనివ్వదు.
ఒక్క రాత్రే కదా తనతో గడిపేది. సంవత్సరానికి ఒక్కరోజు, తనని తృప్తిపరచాలి, సంతోష పెట్టాలి, కబుర్లు చెప్పాలి. తను చెప్పింది వినాలి.
ఆ ఒక్కరోజూ గడిపితే… మళ్లీ మూడువందల అరవై నాలుగు రోజులు నా కోసం, ఆశగా ఎదుర్చూస్తుంది.
ప్రపంచంలో ఎక్కడున్నా నేనా రోజు వస్తానని తెలుసు. తనని నిరాశపరచలేను.
రైలు కదుల్తూంది. సీట్లోకొచ్చి కూర్చున్నాను. లోయర్‌ బెర్త్‌, ఈ ఫెసిలిటీ బావుంటుంది. అరవై దాటితే ఛార్జీల్లో రాయితీలూ, లోయర్‌ బెర్త్‌ అలాట్‌మెంట్లూ!
స్లీపర్‌ క్లాస్‌లోనే కొంచం కోలాహలంగా ఉంటుంది. ఒకరినొకరు పలకరించు కుంటారు, కలసి ప్రయాణిస్తారు. ఏసీలో ఒంటరితనపు ఉక్క పోస్తుంది. ఊపిరి ఆడదు. యంత్రాలు ఊపిర్లు పీల్చవు, చల్లగా ప్రయాణిస్తాయి ఒంటరిగా. ఈ ప్రయాణీకుల సమూహం కనీసం ఒంటరితనాన్ని పారద్రోలడానికి సహాయపడుతుంది.
శివార్లు దాటింది రైలు. వాతావరణం చల్లగా ఉన్నది. కిటికీలోంచి చూస్తే… సూర్యుడు రైలు వెంటబడ్డాడు. అస్తమించే ముందు కూడా ఈ ఆయాసమెందుకో?
వయసుడిగి పోయాకే కోరికలు రెక్కలు విప్పుతాయంటారు. నిజమే కాబోలు?
అనుక్షణం ఆమె జ్ఞాపకమే నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఊపిరి సలప నివ్వదు. ఆ ఒక్కరోజు నేను వెళ్లకపోతే ఏం చేస్తుంది? తట్టుకోగలదా? ఎంతలా ఎదుర్చూస్తుంది నాకోసం! నేను రాలేదని తెలిసిన మరుక్షణం, నా కోసం రూఢీగా బయలుదేరుతుంది, నాకు తెలుసు.
నా నుంచి ఏదీ ఆశించదు. కేవలం నా సాంగత్యం కావాలని కోరుకుంటుంది. ప్రతి సంవత్సరం డిసెంబరు నెల పౌర్ణమి రోజున తప్పక రమ్మంటుంది. రానంటే బ్రతిమిలాడుతుంది, బామాలుతుంది, కుదరకపోతే బెదిరిస్తుంది. ఆఖరికి భయపెడుతుంది, ఎలాగైనా నన్ను తన వద్దకు రప్పించుకుంటుంది. ఆరోజు కోసమే సంవత్సరమంతా కళ్లు కాయలు కాసేలా ఎదుర్చూస్తుంది. ఆమె కోరికని కాదనలేని అశక్తత నన్ను ఆవరిస్తుంది.
చీకటిపడింది. రెండరటిపళ్లు తిని నీళ్లు తాగి పడుకున్నాను.
కళ్లు మూసుకుని పడుకుంటే, రైలు కుదుపులకు మెదడులోని జ్ఞాపకాల అరలు, పొరల్లా విడిపోవడం మళ్లీ మొదలయ్యింది.
హఠాత్తుగా విరగబడి నవ్వుతుంది, గుండెలు బిగపట్టుకుని చూసేవాడ్ని తన నవ్వుని. అంతే హఠాత్తుగా ఆపేసి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఏమని ఓదార్చగలను? ఎలా ఆదుకోగలను? ఆదుకోవలసిన సమయంలోనే అవకాశం ఉండీ ఆదుకోలేదే? ఇప్పుడేం సహాయం చెయ్యగలను? ఎలా సేద తీర్చగలను? నేరుగా తన కళ్లలోకి కూడా చూడలేని పిరికివాడ్ని. తనకు సాంత్వన ఎలా కలిగించగలను? నేలచూపులు చూస్తున్న నన్ను గుచ్చి గుచ్చి చూస్తుంది. తన చూపులని గుండెల్లోకి చొప్పించి కెలికి పారేస్తుంది.
చాలా సార్లు చెప్పాను- ఇక రాలేనని, వయసు, ఆరోగ్యం సహకరించడం లేదని.
విశాలంగా నవ్వేది. నవ్వి, ‘నువ్వెందుకు కష్టపడతావు చెప్పు, నేనే వస్తాను నీ దగ్గరకు,’ అనేది.
నిశ్శబ్దంలో కూరుకుపోయేవాడిని. తను నా వద్దకు వస్తే ఇంకేమైనా ఉందా? నన్ను పిచ్చివాడి కింద జమకట్టి గేలి చేస్తారు. పరిహాసాలాడ్తారు. చులకనగా చూస్తారు.
పిచ్చెక్కిందని సైకియాట్రిస్ట్‌కి చూపెడతారు, ఆఖరికి భూతవైద్యుడ్ని పిలి పిస్తారు. తన దగ్గరకి వెళ్లడం మాత్రం మానలేదు. మానలేను. మానను. తనను నిరాశకు గురి చెయ్యలేను. లయబద్ధమైన శబ్దానికీ, కుదుపులకీ, చల్లటి గాలికీ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను. ఒంటరిగా.

సరైన సమయానికే విశాఖపట్నం చేరుకుంది రైలు.
రిటైరింగ్‌ రూంలో ఫ్రెష్‌ అయ్యాను. కిరండోల్‌ పాసెంజర్‌కి టికెట్‌ తీస్కుని, కేఫెటేరియాలో రెండిడ్లీలు తినేసరికి రైలొచ్చి ఆగింది ప్లాట్‌ఫారవ్‌ు మీద.
కిటికీ పక్కన సింగిల్‌ సీట్‌ సంపాదించాను. కాళ్లు చాచి చేరగిలబడి కూచుని కిటికీలోంచి శూన్యంలోకి దృష్టి సారించాను.
జ్ఞాపకాలు దారి చేసుకుంటున్నాయి. రిపబ్లిక్‌ డే పరేడ్‌లోని సైనిక కవాతులాగా లయబద్ధంగా, క్రమబద్ధంగా ఒకదాని వెనకొకటి ముందుకు వేగంగా చొచ్చు కొస్తున్నాయి. వాటిని నియంత్రించలేని నిస్సహాయుడ్ని.
తన వద్దకు వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతుందనగా మొదలవుతుంది నాలో అలజడి. ఈ నాలుగయిదు నెలలూ గిలగిలా తన్నుకుంటాను. వెళ్లవద్దని నిశ్చయించు కుంటాను, మరుక్షణం సమాయత్తమవుతుంటాను.
చిత్రవధ అనుభవిస్తాను. నిశ్చింత కోల్పోతాను. ఎవరితోనూ పంచుకోలేని వేదన, యాతన.
ఒంటరిని, ఏకాకిని. సమూహంలోంచి వెలివేయబడితే అది ఒంటరితనం. అదే సమూహాన్ని వెలివేస్తే అది ఏకాంతం.
ఒంటరితనం భయపెడుతుంది. ఏకాంతం పునరుజ్జీవింపచేస్తుంది.
సమూహం వెలివేయలేదు. నేను సమూహాన్ని దూరం చేసుకోలేదు. దగ్గరా చేసుకోలేదు. పాక్షిక ఒంటరితనం, పాక్షిక ఏకాంతం. రెండూ కలిసినా అసంపూర్ణం. శూన్యాన్ని కూడా దరిచేర్చుకోలేనివాడ్ని.
ఒక్కసారిగా కిటికీ బయట చీకటి అలుముకుంది. నిశ్శబ్దంలో రైలు శబ్దం గొంతు చించుకుంది. కొద్దిసేపటికి మళ్లీ కిటికీ ముందు వెలుతురు వెల్ల వేసింది. టన్నెల్‌ దాటాము. దూరంగా పచ్చటి కొండలు కళ్లకు ఉపశమనం కలిగిస్తున్నాయి.
ఎత్తుకు ఇంకా… ఇంకా ఎత్తుకు ఎగబాకుతుంది రైలు, లోయల్ని దాటు కుంటూ మలుపులు తిరుగుతూ జలపాతాలని ఆవిష్కరిస్తూ. ప్రకృతిలో మమేకం అయిపోయాను. అప్పటివరకూ అలజడిలో కొట్టుమిట్టాడుతున్న నేను స్థిమితపడ్డాను.
పెద్ద మలుపు తిరుగుతూ, నెమ్మదిగా ఆగిపోయింది రైలు. అల్లంత దూరంలో చిన్న బ్రిడ్జి. తరువాత ఏదో స్టేషను కనిపిస్తూంది. బ్రిడ్జి మీద కొందరు గ్యాంగ్‌మెన్లు పనిచేస్తున్నారు. వారికి దగ్గరగా పాతిన ఎర్రజండా రెపరెపలాడుతున్నది. రిపేరు అనుకుంటా.
పది… పదిహేను… ఇరవై నిమిషాలు. ‘ఇంకాస్త సమయం పట్టేటట్టుంది,’ అని రైలు దిగి పరిశీలిస్తున్నవారు మాట్లాడుకుంటున్నారు.
మెల్లిగా కిందికి దిగాను. పట్టాలకు పక్కగా నాలుగడుగులు వేస్తే… అక్కడి నించి లోయ. లోతుగా. సుమారు మూడ్నాలుగువందల అడుగుల లోతు లోయ. చుట్టూ కొండలు. మధ్యలో లోయ, లోయ అడుగున నీటిచెలిమెలా మంచు పరుచు కుని కొలనును తలపిస్తూంది. కళ్ల ముందు అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడింది. ఆ పొగమంచు కొలనులో మధ్యలో ఒక పెద్ద వృక్షం నిశ్చలంగా నిలబడి ఉన్నది. ఒంటరిగా.
పై నుంచి చూస్తే చిన్న చెట్టులా కనిపిస్తూంది. ఎందుకో దాన్ని చూస్తే దిగులు కమ్ముకుంది.
గార్డు పచ్చజండా ఊపుతూ… విజిలేశాడు. కూడదీసుకుని రైలెక్కాను.
పెట్టె నిండా జనం ఉన్నా, ఒంటరితనం మహమ్మారిలా నన్ను ఆవహించింది.

రెండుగంటలు ఆలస్యంగా చేరుకుంది రైలు ‘అరకు’కు.
బ్యాగు చేతబట్టుకుని మెల్లిగా దిగాను. మధ్యాహ్నం దాటినా వాతావరణం చల్లగా ఉంది. చుట్టూ చూసాను.
ఎగ్జిట్‌ గేటు బయట ఎప్పుడూ నిల్చునే ప్రదేశంలోనే నిల్చుని ఉన్నాడు అతను! ఆమె భర్త. భావరహితంగా చూశాడు నన్ను. అతడ్ని చేరుకున్నంతలో, దారి తీస్తూ ముందుకడుగేసాడు. ఎప్పటిలాగే అనుసరించాను.
పంచ గోచీ పెట్టుకుని, చేతుల బనీనుతో, సుమారు నా వయసుంటుం దతనికి. సన్నగా బలంగా ఉన్నాడు. నాలుగడుగులు వేసాక, ఒక ఆటో వచ్చి అతని పక్కన ఆగింది. ఆటో డ్రైవరు పక్కన కూచున్నాడు. నేను వెనక కూర్చున్నాను.
ఆటో సుమారు మూడు కిలోమీటర్లు ప్రయాణించి మెయిన్‌ రోడ్డు పక్కగా, పోలీస్‌స్టేషనున్న సందులోకి తిరిగి, దాన్ని దాటి నాలుగు ఫర్లాంగులు ముందుకెళ్లి ఒక కొత్తగా సున్నం వేసిన పాత గెస్ట్‌ హౌస్‌ ఆవరణలోకి అడుగుపెట్టింది. సుపరిచిత ప్రదేశమే. నా నరాల్లో రక్తప్రసరణ వేగం పెరగడం నాకు తెలుస్తూనే ఉంది.
అతను ఆటోవాడిని పంపించేసి ప్రధాన ద్వారం వైపుకి దారితీసాడు. వెనకే నేను. పెద్ద తలుపుకున్న గొళ్లం తీసి నిల్చున్నాడు. నేను లోపలికి ప్రవేశించాను. అలాగే ఉంది గది. కొత్తగా సున్నం వేసినందుకు కాబోలు, గోడలు కాస్త ప్రకాశవంతంగా ఉన్నాయి. రక్తం ఉరకలు వేసే వయసులో నా స్నేహితుడు చేసిన చీకటి అరాచకానికి ఘనీభవించిన సాక్ష్యాలు నాతోపాటు ఈ గోడలు.
తెల్లటి దుప్పటి కప్పిన డబల్‌కాట్‌ బెడ్డూ, పక్కగా రెండు కుర్చీలు, టీ పాయ్‌. మూలగా పురాతన వార్డ్‌రోబ్‌ నానుకుని డ్రస్సింగ్‌ టేబుల్‌. కొంచం కూడా మారలేదు. అలాగే ఉంది. అప్పటిలాగే ఉంది.
ఎడమవైపు గోడకి పెద్ద కిటికీ, మూసి ఉంది. కిటికీ వద్దకెళ్లి నిల్చున్నాను. కిటికీ తలుపుల సందుల్లోంచి చల్లటి మంచుతెరలా, చల్లటిగాలి చొచ్చుకు రావడానికి ప్రయత్నిస్తూ… సూదుల్లా గుచ్చుతూ ఉంది. చలనరహితంగా మూసి ఉన్న కిటికీ తలుపులనే చూస్తూ నిల్చున్నాను. ఆ కిటికీకి అవతల ఆరు గజాల లోతులో ఏముం టుందో నాకు తెలుసు. తెరిచే ప్రయత్నం చేయలేదు.
వెనకగా అలికిడి వినిపిస్తే తిరిగి చూశాను. అతను, వేడి నీళ్ల బకెట్‌ బాత్రూంలో పెట్టి వెనుదిరిగాడు. టీ కావాలని చెప్పాను. విని వెళ్లిపోయాడు. బ్యాగులోంచి టవలూ, సోపు తీసుకుని బాత్రూములోకి దూరాను.
వేడి నీళ్ల స్నానంతో కాస్త అలసట తీరినట్టనిపించింది. తల తుడుచుకుంటూ బయటికి వచ్చేసరికి టీ పాయ్‌ మీద టీ కప్పు పెట్టి ఉంది. పక్కనే బిస్కెట్‌ పాకెట్‌. ఆకలి లేదు. టీ తాగేసి లుంగీ జుబ్బా తగిలించుకుని రూంలోంచి బయటపడ్డాను.
వసారాలో ఓ మూలగా ముంగాళ్ల మీద కూర్చున్న అతను నన్ను చూసి లేచాడు. అతను నాతో మాట్లాడిన గుర్తు ఇప్పటివరకూ లేదు. ఇన్నేళ్లనించి అంతే, శూన్యంలోకి చూసినట్టు చూస్తాడు. కానీ అతని కళ్లలోని ఎరుపు ఈరోజుకీ అలాగే ఉంది.
ముందుకడుగేసాను. అతనక్కడే నిల్చుండిపోయాడు.
గేటు దాటి ఎడమవైపుకి తిరిగి నెమ్మదిగా నడవసాగాను, దూరాన పచ్చిక బయళ్లూ ముదురాకుపచ్చని కొండలూ, కుడివైపుకి దూరంగా వాగొకటి కదలికలు కనిపించకుండా మెల్లిగా జారుతోంది.
ఆ ప్రశాంత వాతావరణంలో, లోపల దాగి ఉన్న ఆ కాస్త బెరుకూ మాయ మైంది. శరీరం కొంచం శక్తి పుంజుకున్నట్టనిపించింది. అడవంతా సాయంకాలపు నీరెండలో అలౌకికంగా కనిపించింది. పొడవాటి పున్నాగచెట్ల పూలు సుగంధాలు పంచడానికి ఒళ్లు విరుచుకుంటున్నాయి. హాయిగొలిపే అద్భుతమైన అడవి పరిమళం చుట్టుముట్టింది. తనువుకీ, మనసుకీ బలం చేకూరినట్టయింది. అడవంతా దేనికో ఎదుర్చూస్తున్నట్టు, ప్రకృతంతా ఎవరినో ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేసుకుంటు న్నట్టు, అడవిలోంచి పక్షుల కోలాహలం వినిపించసాగింది. చలికాలం ఇంకాస్త తొందరగానే చీకట్లు అలుముకునే ఛాయలు కనిపిస్తున్నాయి. ఆలోచనల్లో పడి చాలా దూరం వచ్చినట్లున్నాను. వెనక్కి మళ్లాను.
గెస్ట్‌ హౌస్‌కి చేరుకునేటప్పటికి చిక్కని చీకటి అలుముకున్నది. వసారాలోని లైటు చీకటిని నిలువరించే ప్రయత్నంలో ఓడిపోయింది. చల్లటి గాలి రివ్వున వీయ సాగింది. చలి మెల్లిగా ప్రకృతినంతటినీ ఆక్రమించే క్రమంలో ఉంది.
నన్ను చూసి అతను తలుపు గొళ్లం తీసాడు. లోపలికి అడుగేసి అలసటగా కుర్చీలో కూర్చున్నాను. సమయం ఏడుగంటలు దాటి ఉంటుంది. గదిలోని నిశ్శబ్దం ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుంది. బయట చీకటి కీటకాల ధ్వని ప్రతిధ్వనిస్తూంది. గదిలో వెలిగించిన అగరొత్తుల మరిమళం సుడులు తిరుగుతున్నది.
బ్యాగులోంచి స్మిర్మ్‌ ఆఫ్‌ వోడ్కా బాటిల్‌ తీసి టీపాయ్‌మీద పెట్టాను. కాళ్లు చాచుకుని, రిలాక్సుడుగా కూచున్నాను.
అతనొచ్చి టీపాయ్‌ మీద వాటర్‌ బాటిలూ, కడిగి తుడిచిన రెండు గ్లాసులూ, కాసిని కోసిన నిమ్మకాయ చెక్కలూ, ఉడకబెట్టిన వేరుసెనగ కాయల ప్లేటూ పెట్టి వెళ్లాడు. మళ్లీ ఒక ప్లేటు మీద మరొక ప్లేటు బోర్లించి తీసుకువచ్చి మూలగా నున్న డ్రస్సింగ్‌ టేబుల్‌ మీద పెట్టాడు.
నాకు తెలుసు అందులో రాత్రి డిన్నర్‌కి సంబంధించిన చపాతీలూ, చికెనో లేక పప్పో లేక బంగాళాదుంపల కర్రీనో ఏదో ఉంటుందని, ఏదైనా నాకు ఓకే.
అన్నీ చకచకా సర్దేసి ఇక వెళ్తానన్నట్టు నిల్చున్నాడతను. తలూపాను.
అప్పటివరకూ భావరహితంగా ఉన్న అతని కళ్లు, వెళ్తూ అతను చూసిన చూపులో ఏవో కొత్త భావాలు ప్రకటించసాగాయి. నాకు అర్థం కాలేదు. తలుపు దగ్గరగా వేస్తూ బయటికి నడిచాడతను.
రెండు గ్లాసుల్లో వోడ్కా 90 ఎవ్‌ు.ఎల్‌ పోసి, నిమ్మకాయని పిండాను. తరువాత నీళ్లతో గ్లాసుల్ని నింపేసి సిప్‌ చేసి తనకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను.
ఇపుడో, ఇంకాసేపట్లో రావచ్చు తను. అతను వెళ్లిపోయాకే వస్తుంది ఎప్పుడూ.
ఒక్కోసారి మెల్లిగా చడీ చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ప్రత్యక్షమవుతుంది. ఒక్కోసారి హఠాత్తుగా మీద పడిపోయి భయపెట్టేస్తుంది. భలే అల్లరిది. ఆ అల్లరిని తట్టుకునే శక్తి కావాలి ఈ వయసులో,
లేచి వసారాలోకి వచ్చాను. దూరంగా గేటు మూసేసి ఉంది. ఎక్కడా అతని అలికిడి లేదు.
ఇంకా రాలేదేం తను. ఎప్పుడూ ఆవురావురంటూ వచ్చి వాలేది. ఇవ్వాళే మయ్యిందో! పున్నమి వెలుగులు అడవిని ఆక్రమించేసాయి. చల్లటి గాలులతో, పచ్చటి వాసనలతో, ప్రకృతంతా పండగ చేసుకుంటున్నట్టనిపించింది.
వెనక్కి తిరిగి గదిలోకి అడుగుపెట్టి శిలలా నిల్చుండిపోయాను.
మంచం మీద, తెల్లటి దుప్పటి మీద వెల్లకిలా పడుకుని ఉంది. నిశ్చేష్టుణ్ణ యిన నన్ను చూసి గలగలా నవ్వింది.
‘‘ఇక నేను రాననుకున్నారు కదూ? గండం గడిచిందనుకున్నారు కదూ?’’ పకపకా నవ్వింది.
తలుపులు దగ్గరగా వేసి వచ్చి కుర్చీలో బొమ్మలా కూర్చుండిపోయాను.
‘‘నేనిక్కడే ఉన్నానుగా… ఎలా వచ్చావు?’’ అడిగాను,
‘‘ఎప్పటిలాగే వచ్చాను, ఎప్పుడూ ఎలా వస్తానో మీకు తెలీదా?’’ ఫక్కున గది అదిరిపోయేలా నవ్వింది. నవ్వీ నవ్వీ అలిసిపోయింది. తన గుండెలు ఎగిసిపడు తున్నాయి. ఇక నవ్వలేనన్నట్టు సైగ చేస్తూ వచ్చి నా ఎదురుగానున్న కుర్చీలో కాళ్లు పైకి లాక్కుని కూర్చుని చీరని పాదాల పైకి లాక్కుంది.
కళ్లతోనే తనకెదురుగా ఉన్న నిండు గ్లాసుని చూపించాను.
‘‘అవన్నీ నాకు పడవులే సారూ. చెప్పండి ఎలా ఉన్నారు? ఏవిటి విశేషాలూ?’’ అడిగింది.
నేను పెదవులు సాగదీసాను. ముందున్న గ్లాసు తీస్కుని గడగడా మొత్తం ఒక్క గుక్కలో తాగేసాను.
‘‘నెమ్మది… నెమ్మది. మరీ అంత తొందరయితే ఎలా? గబుక్కున మొత్తం తాగేసి మత్తుగా పడుకోవడానికా ఇంత దూరం వచ్చింది. ఈ రాత్రి మిమ్మల్ని పడుకోనివ్వనని తెల్సుకదా!’’ కన్ను గీటి నవ్వుతూ అంది.
మెల్లిగా లేచి వెళ్లి బ్యాగులో నుంచి రెండు బి. పి. ట్యాబ్లెట్లూ, రెండు షుగర్‌ ట్యాబ్లెట్లూ వేస్కుని బాటిలెత్తి గడగడా నీళ్లు తాగేసాను.
‘‘మెల్లిగా, మెల్లిగా. ముందు మీరు హాయిగా సేదతీరండి,’’ ఆదుర్దాపడింది.
తన గొంతులో ఆందోళన ధ్వనిస్తున్నా… కళ్లలోని కొలుముల వేడి నాకు తగుల్తూనే ఉంది.
ఇంకో పెగ్గు కలుపుకున్నాను. మెల్లిగా తలెత్తి తన వంక చూసాను.
నిజంగా ఎంతందం తనది.
మొదటిసారి సరిగా చూడలేదు కానీ, తరువాత్తరువాత తరచి చూస్తే కాని తెలీలేదు. చప్పిడి ముక్కుతెమ్మెలు. రెండింటికీ పుడకలు, వాటి మధ్య పోగు ముద్దలా ఉంటుంది. ముద్దుగా ఉంటుంది. చిన్న కళ్లు. చీకటి రంగు పులుముకున్న కళ్లు. ఆశలు పురిగొల్పే కళ్లు.
రెండు కనుబొమల మధ్యా… చివరా పచ్చబొట్లు, నుదుట పావలా కాసంత ఎర్రటి బొట్టు. వత్తుగా నూనె రాసుకుని పాపిట తీసి దువ్వుకున్న జట్టు. ఎడమ చెవి మీదుగా కట్టుకున్న కొప్పు. దాంట్లో తురుముకున్న అడవి పూలు. విరబూసిన ప్రకృతిలా ఉంటుంది. ప్రకృతి అంటేనే నలుపు రంగు. తనదీ నలుపే ప్రకృతిలా. నలుపులో ఇంత మెరుపు ఉంటుందని తనని చూసాకే తెలిసింది. ప్రకృతిని చూసి మైమరిచిపోని దెవరు? అందులో లీనమవ్వాలనేగా అందరూ కోరుకునేది. తనివితీరా ఐక్యమవ్వాలనే కదా ప్రయాణాలు చేసి తన ఒడిలో సేద తీరే మార్గాలను అన్వేషించేది.
ఎంత అందంగా ఉంటుంది. సృష్టిలోని ఏ పూవునైనా తన రంగుతో పోల్చ గలమా? పూవులెంత పాపం చేసుకున్నాయి. ఆ నలుపు రంగుకు మెరుపులతో మెరుగులు దిద్దినట్లు, ఎంత ప్రకాశవంతమైన నలుపు. ఇన్నాళ్లనించీ చూస్తూ ఉన్నా తన వయసెంతుంటుందో ఇదమిత్థంగా తేల్చుకోలేకపోతున్నాను. పదహారూ పద్దెనిమిదీ మధ్య ఖచ్చితంగా ఉంటుంది. ఆమె బుగ్గలపైని నునుపే తన వయసును నిర్ధారిస్తూ ఉంది.
‘‘ఏవండీ. ఎక్కడ తేలిపోతున్నారు, నేను మీ ముందుండగా ఆలోచనల్లోకి జారే అనుమతి లేదు ఇవ్వాళ,’’ ఆజ్ఞ జారీ చేసి కిలకిలా నవ్వింది.
నిశ్శబ్దంగా నిండుగా ఉన్న గ్లాసు వంక చూడసాగాను.
‘‘మీ స్నేహితుడు కనిపించాడా? నిజం చెప్పండి. నాకతన్ని ఒకసారి చూడాలని వుంది. పాపం?’’ కళ్లు చికిలించి చిలిపిగా నవ్వుతూ అంది.
మొట్టమొదటిసారి ఆమెని కలిసినపుడు నా ఫ్రెండూ నేను ఉన్నాము. ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో రైల్లో పడుకుని తెల్లవారాక చూస్తే… లేడు. తప్పి పోయాడని ఎక్కడెక్కడో వెదికాము. ఇన్నేళ్లయినా అతని జాడ మాత్రం తెలియలేదు. తెలుస్తుందన్న నమ్మకమూ లేదు. మనం చేసిన పనులకి ఫలితం కోసం ఎన్నాళ్లో ఆగాల్సిన అవసరం లేదు, కొన్నింటికి వెంటనే ప్రతిఫలం లభిస్తుంది. సాక్షీభూతమై, ప్రేక్షక పాత్ర పోషించినందుకు మూడున్నర దశాబ్దాల మానసిక శిక్ష సరిపోతుం దనుకోను.
నేను మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ మందు సిప్‌ చేసాను. రుచి మారింది. నిమ్మకాయ బద్దని కొద్దిగా గ్లాసులో పిండాను.
ఆమె చూపుల వాడి నాకు తెలుస్తూనే ఉంది.
‘‘ఏంటి సారూ! ఇన్నేళ్లయినా మీరు మారలేదు. క్షణక్షణానికీ మధ్య ఎక్కడికో జారుకుంటూంటారు?’’ బి.పి. ట్యాబ్లెట్లు పనిచెయ్యడం ప్రారంభించినట్టున్నాయి. కాస్త తేరుకున్నాను.
‘‘ప్రతి సంవత్సరం ఆడవాళ్ల మీద అప్పటివరకూ జరుగుతున్న అరాచకాలను చెపుతున్నారు కదా, మరి ఈ సంవత్సరంలో అలాంటి సంఘటనలేం లేవా?’’
ఉన్నాయి అన్నట్టు తలాడించాను.
‘‘మొదలుపెట్టండి మరి!’’
నేను మొదలుపెట్టాను. నాకు గుర్తున్నంత మేరా చెప్పసాగాను. కళ్లు నేలలోకి పాతేసి ఏకరువు పెట్టసాగాను. కళ్లు ధారాపాతంగా కురుస్తూనే వున్నాయి. కళ్లకి నీటి తెరలు అడ్డువచ్చినా, గొంతు దుఃఖంతో పూడుకుపోతున్నా, చేతుల్లో శక్తి నశించినా, చెపుతూనే వున్నాను. మందు మొత్తం అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకం తెచ్చుకుంటూ, గుండెలు ఉగ్గబట్టుకుని దేశవ్యాప్తంగా మగవాళ్లు అమ్మాయిలపై చేసే అకృత్యాలని, మనసును తునాతునకలు చేసే సంఘటనలను చెపుతూనే ఉన్నాను.
ఎన్ని చెప్పినా ఇంకా… ఇంకా… చెప్పాల్సినవి మిగిలే ఉన్నాయి. అప్పుడే అయిపోయే సంఘటనలా! నావంటి మగ రాక్షసుల చేతుల్లో నలిగిపోయే అమ్మాయిల లెక్క అంత తొందరగా తేలుతుందా? ప్రతి పదిహేను నిమిషాలకీ ఒక రేప్‌ జరిగే దేశంలో ఉన్నాము. సంవత్సరం సంఘటనలు చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి, ఎన్ని రాత్రులు కావాలి, కళ్లల్లో ఎన్ని సముద్రాలు పొంగాలి?
కళ్లు తుడుచుకుంటూ చెపుతూనే ఉన్నాను… చెపుతూనే ఉన్నాను.
తెల్లవారిపోయిన సంగతెప్పుడో తెలిసింది. చెప్పడం ఆపి తలెత్తి చూసాను.
తను లేదు. గబుక్కున లేచి తలుపులు తీసుకుని బయటికి వచ్చాను.
అతను తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని వాటికి చూపులు కట్టేసి నిల్చున్నవాడు నా వంక చూసాడు.
నేను వేగంగా బయటికి నడిచాను. అతను గభాలున గదిలోకి దూరి నా బ్యాగు అందుకుని నా వెనక నడిచాడు.
ఆ తెల్లవారుజామున నన్ను బస్సు ఎక్కిస్తూ కళ్లతో వీడ్కోలు పలికాడు. జుబ్బాలో చేయి పెడితే ఎన్ని డబ్బులు వచ్చాయో తెలీదు. అన్నీ అతని చేతిలో కుక్కాను. నా చేతిలో చేయి వేసి ఈ ముప్పై అయిదేళ్ల నించి నోరు తెరవని అతను మొట్టమొదటిసారిగా నోరు విప్పాడు.
‘‘మీకు ఇక్కడికి రావాలనిపించదు, తనని కలుసుకోవాలనిపించదు, మాట్లాడా లనిపించదు, చూడాలనిపించదు. కానీ, ఆమె కేవలం మీకే కనిపిస్తుంది, జరుగుతున్న అరాచకాన్ని ఆపే శక్తి ఉండీ, ఆపలేకపోవడమే మీరు చేసుకున్న పాపం. నాకు ఆమెని ఒక్కసారైనా కళ్లనిండా చూసుకోవాలని ఉంటుంది. మాట్లాడాలని ఉంటుంది. నేనింకా తనని మరిచిపోలేదని చెప్పాలని ఉంది, తన ముందు తనివితీరా ఏడవాలనిఉంది. నాకు కనిపించదు. నేను చేసిన పాపమా? ఆడవాళ్లమీద మగవాళ్ల అఫూయిత్యాలు ఆగవు, మీకు విముక్తి లభించదు. మీరు బతికి ఉన్నన్ని రోజులూ ఈ చిత్రవధ అనుభవించక తప్పదు.’’
నా మీద నిప్పులు కురిపించాల్సిన కళ్లు, నన్ను చూపులతో నిలువునా భస్మం చేయాల్సిన కళ్లలో నాకు కనిపించిన భావం చూసి ఒళ్లు గగుర్పొడిచింది.
అతని కళ్లలోని భావం నన్ను మరుగుజ్జుని చేసింది.
అది ‘జాలి.’

కొట్టం రామకృష్ణారెడ్డి 24 ఆగస్టు, 1969న రంగారెడ్డి జిల్లా ఘట్‌పల్లిలో జన్మించారు. వీరి మొదటి కథ తీర్పు రచన మాసపత్రికలో ఫిబ్రవరి, 1994లో అచ్చయింది. దాదాపు 15 కథలు రాశారు. మానవ సంబం ధాలు, వాటి చుట్టూ అల్లుకున్న భావోద్వేగాలు ఇష్టమైన ఇతివృత్తాలు.
చిరునామా: 17-1-382/పి /123, గవర్నమెంట్‌ ప్రెస్‌ కాలని, చంపాపేట్‌, హైదరాబాద్‌ – 500 059.
ఫోన్‌ : 924 6565 824 తీసతీసశ్‌్‌ీaఎఏస్త్రఎaఱశ్రీ.షశీఎ

AKSHRA
error: Content is protected !!