చెరువొడ్డు

నందిని సిధారెడ్డి

తొలికిరణం
చెరువును రంగరించి
ఒడ్డును పుదిస్తది
ఆ కడ
కండ్లు నులుముకుంటూ
జీవితం జిగేల్‌మంటది
మొలిసీ మొలవని
గడ్డిని బర్లు బంతి పడితే
కాపర్లు గోనెతో
లోకాలు కొలుస్తరు
బరువు దించుకొనెతందుకు కూచున్న
బసుగు పొదలోంచి
బాబాసెహెగల్‌ విచిత్రం వినిపిస్తడు
కుటుంబాన్ని పోషిస్తున్న
అందాల ఆటోకు లాలపోస్తూ
అతనొక పులకింత
బురద చేతుల్తో
పొలంలో డైరీ రాస్తున్న రైతు
బట్టలమురికి వదిలించెతందుకు
బండమీద కరుగుతున్న యౌవనం
వెనక కూచుని నేర్పుతూ ఆయన
కొత్త ప్లెజర్‌ నడుపుతూ
టెన్షన్‌కూ ప్లెజర్‌కూ నడుమ ఆవిడ
ఆపూట
బతుకుబాటకు
వేషం వేసుకుంటున్న బావాజోడు
చల్లారిన బూడిదలోంచి
ఒక్కొక్కటే బొక్కలేరుతూ
కుండలో వేస్తున్న వారసులు
శరీరం తీరని మోహం
మెల్లగ ఉరుకుతూ కొందరు
వేగంగ నడుస్తూ కొందరు
ఎప్పటి సందడి అప్పటిదే
ఎవల ఆరాటం వాళ్లదే
ఒక కొసన ఎగిరి
ఒక కొసన వాలొచ్చు
ఒక దగ్గర మొదలై
ఒక దగ్గర ముగియొచ్చు
ఏదయినా జీవితమే
పరుగులు
పరవశాలు
దుఃఖాలు చూసిన ఒడ్డు
కాలాలు
కల్లోలాలు
కారిÄన్యాలు భరించిన ఒడ్డు
మునుగుతది తేలుతది
నానుతది ఎండుతది
ఆ ఒడ్డు
పొద్దున సందడి
రాత్రి ఒంటరి

 

AKSHRA
error: Content is protected !!