దమయంతి కూతురు

పి. సత్యవతి

ఆదివారం నాడు నా గదిలో ఉదయభానుడు ప్రవేశించకుండా గవాక్షపు తెర దించే ఉంచుతాను. కానీ ఆది సోమవారాల దినభేదాలు లేకుండా ఆరింటికే లేచి, పాత హిందీ పాటల నేపథ్యంలో కాఫీనీ, ఆంగ్ల, తెలుగు దినపత్రికలనూ, వాటి సప్లిమెంట్లనూ ఆస్వాదిస్తూ ఉండే స్నేహ, నా దీర్ఘ నిద్ర భరించలేదు.
‘ఇలా సోంబేరిలా పడుకున్నావంటే నిన్ను లేపేస్తా,’ అని ద్వంద్వార్థాల డైలాగులు విసురుతుంది. అంచేత నేనూ త్వరగానే లేచి బుద్ధిగా పళ్లు తోముకుని వచ్చేసరికే, ‘‘ఆవో హుజూర్‌… తువ్‌ు కో సితారోఁ మే లే చెలూఁ…’’ అంటూ కాఫీ మగ్గు పక్కన పెట్టింది.
పెట్టి, ‘‘చెప్పండి హుజూర్‌, ఆజ్‌ ఆప్‌ కో కహా కహా లే చెలూఁ’’ అంటూండగానే నిశ్చల తటాకంలో రాయి విసిరినట్టు ఫోన్‌ మోగింది.
మా అత్తయ్య.
‘నాకు నువ్వు పెళ్లి సంబంధాలు చూడొద్దు అత్తయ్యా,’ అని చాలా కోపంగా నిష్కర్షగా చెప్పినా అత్తయ్య ఊర్కోదు.
‘‘సామర్లకోట నించి సంతోష్‌ అనే కుర్రవాడి అమ్మానాన్నలకి నీ ప్రొఫైల్‌ బాగా నచ్చింది. వాళ్లతో మాట్లాడాను. ఆ అబ్బాయికి కూడా నచ్చింది. గురువారం వాళ్లని తీసుకుని నీ దగ్గరకొస్తాను. సెలవుపెట్టి ఉండు,’’ అని హుకుం జారీ చేసింది. ఆదివారానికీ గురువారానికీ మధ్య చాలా దూరం ఉంది కనుక ఏదో సాకు చెప్పేసి తప్పించుకుందాం అనుకున్నాను.
‘‘బుర్ర మసాజ్‌ కోసం బ్యూటీషియన్ని రమ్మన్నాను తొమ్మి దిన్నరకి. అదయినాక తిరుగుడు, తినుడు, కొనుడు, చర్చించుడు వగైరా వగైరా…’’ అంది నెచ్చెలి.
ఎక్కడెక్కడ షికారు చేద్దాం, ఎక్కడ తిందాం, ఏం కొందాం, ఎవరికి ఫోన్లు చేద్దాం అని జాబితా వేస్తుండగా మళ్లీ ఇంకొక రాయి …
‘‘నేను మీతో మాట్లాడాలి. ఎప్పుడు, ఎక్కడ కుదురుతుంది చెప్పండి,’’ ఎవరో కాదు, నా ప్రొఫైల్‌ నచ్చిన సామర్లకోట సంతోష్‌.
‘‘నన్ను కలవొద్దు మాట్లాడొద్దు. నా ప్రొఫైల్‌ మీకు నచ్చితేసరి పోయిందా? మీది నాకు నచ్చక్కర్లేదా? అయినా గురువారం ఎటూ ఉందిగా కొలువు. మధ్యన ఇప్పుడెందుకు?’’ అంటే-
‘‘చాలా ముఖ్యమైన విషయం, పర్సనల్‌గా మాట్లాడాలి ప్లీజ్‌,’’ అన్నాడు.
‘‘ఏయ్‌, రానివ్వమ్మా. కాసేపు వినోదం. ఇప్పుడే మన గృహానికే… ఏతెంచమను. తొందరగా తేల్చేద్దాం. మై హా నా,’’ అని స్నేహ సలహా ఇచ్చింది. ‘సరే,’ అని కందిరీగల తుట్టె కదిలించాను.
సంతోష్‌ ఫ్రవ్‌ు సామర్లకోట నా అంతా చదువుకున్నాడు. నాలాగే మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మంచి బట్టలు వేసుకుని ‘బ్రూట్‌’ పరిమళం చల్లుకుని (మౌత్‌ వాష్‌ కూడా పుక్కిలించి), ఘుమఘుమలాడుతూ వచ్చాడు. కొన్ని మర్యాద మాటలూ, మన్ననలూ అయ్యాక వచ్చినపని బయటపెట్టాడు. దమయంతమ్మ నిజంగా చచ్చిపో యిందా, లేక వెళ్లిపోయిందా? అనే గొప్ప సందేహం నిన్న రాత్రి ఆకస్మాత్తుగా వాళ్లమ్మకి వచ్చిందట. ఆవిడప్పటినించీ ఒకటే సణుగుడుట! నిజానికి అతను ‘వెళ్లిపోయిందా?’ అనలేదు. మా ఊళ్లో మా చుట్టాలు, పక్కాలు ఇరుగు పొరుగులు, అంతగా చదువురాని వాళ్లు, బ్రూట్‌ పరిమళాలూ మౌత్‌వాష్‌లూ ఎరుగనివాళ్లు వాడేసి వాడేసి అరిగిపోయి కాలం చెల్లిన ఒక మాట అన్నాడు.
‘‘సారీ సంతోష్‌ … దమయంతమ్మ చనిపోయిందని చెప్పి మిమ్మల్ని సంతోష పెట్టలేను. మీరు వాడారే ఇందాకొకమాట! ఆ పనే చేసింది. ఆ దమయంతమ్మ కూతుర్ని నేను. సరేనా. చెప్పండి మీ వాళ్లకి,’’ అన్నాను. అతను చల్లుకొచ్చిన పరిమళం నా కడుపులో తిప్పుతోంది.
‘‘అబ్బే అదేం లేదు … నేను మా వాళ్లని కన్విన్స్‌ చేస్తాను. మిమ్మల్ని గురించి ఆఫీస్‌లో… అక్కడా చాలా బాగా చెప్పారు అని చెప్తాను… ఊర్కే అడిగానంతే…’’
‘‘మరి నేను మిమ్మల్ని గురించి మీ ఆఫీసులో… అక్కడా అడగలేదే. అయినా ఎందుకొచ్చిన అనుగ్రహం ఇది. మనిద్దరికీ కుదరదు సంతోష్‌గారూ. పెళ్లిచూపు లొద్దని చెప్పండి. నేను మా అత్తయ్యకి చెప్పేస్తాను,’’ అని నమస్కరించేశాను.
‘‘మీ అత్తయ్యనిక్కడకి తెచ్చెయ్యి. గొడవుండదు. అక్కడ కూచుని ఊర్కే సంబంధాలంటూ గోల పెట్టేస్తుంది,’’ అంది స్నేహ.
‘‘సరేలే. ఇప్పటికే ఆవిడ కొడుకూ కోడలూ ఆవిడేదో నాకు దోచి పెట్టేస్తోందని బాధపడిపోతున్నారు. ఇక్కడికొస్తే ఆవిడ డబ్బుకోసం, బంగారం కోసం నేను తెచ్చు కున్నానంటారు. అసలు ఆవిడే నన్ను తల్లి లేని పిల్ల అని చాటింపు వేసింది. నిజం చెప్పేస్తే పోదా? ఎందుకోగానీ ఆవిణ్ణి నొప్పించలేను… పెంచింది కదా నన్ను.’’
‘‘అలాగని రోజుకో సంతోష్‌ వచ్చి నిన్ను ఏడిపిస్తే ఊర్కుంటావా ఏం? అదేం కుదరదు,’’ అంది స్నేహ.
సంతోష్‌ మాటలకి నాకేం ఏడుపు రాలేదు.
ఇటువంటి వాటికి నా అశ్రువులిప్పుడు స్పందించవు. చిన్నప్పుడు చాలా ఏడ్చాను. బహుశా ఈ జీవితానికి సరిపడ… తరువాత ఏడుపు ఆపుకోడానికి చాలా కష్టపడ్డాను. ఎంతో విలువైన ఉద్వేగాలు, స్పందనలూ తప్ప మరేవీ కన్నీళ్లకి అర్హం కావని తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. అంచేత ‘మీ విలువ నిలబెట్టుకోమని’ నా ప్రియమైన కన్నీటి మిత్రులను వేడుకున్నాను. ఇప్పుడిప్పుడే నా మాట వింటున్నా యవి. అసలు దమయంతికి ఒక మచ్చ పెట్టడానికి, దాన్ని నాకూ అంటించడానికి, మా మీద అసహ్యమో అనుగ్రహమో చూపించడానికి వీళ్లవరు?
స్నేహని దేవుడు కేవలం నాకోసమే సృష్టించినట్టు నా క్లాస్‌మేట్‌ అయింది. తరువాత నా కొలీగ్‌ అయింది. కలిసి ఒక అపార్ట్‌మెంట్‌ తీసుకొనడంతో నా ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌, గైడ్‌ అయిపోయింది. మా అన్నయ్య తరువాత తనే ఆత్మబంధువు నాకు. ఆమె ఒక ఝరి. నా సుదీర్ఘ మౌనాన్ని కరిగించింది.
ముడుచుకుపోయిన నన్ను కాస్త కాస్త సాఫు చేసింది. నవ్వడం నేర్పింది. నాకూ పాడడం వచ్చని గుర్తు చేసింది. పుస్తకాలు చదవడం అలవాటు చేసింది. స్నేహ బ్యుటిషియన్‌కి బుర్ర అప్పగించి కూచుంది. నేను కూడా కళ్లు మూసుకుని కూచున్నాను. నా మనో యవనిక మీద నలుపు తెలుపు జీవన దృశ్యాలు.

సౌందర్య వాళ్లింట్లో సంగీతం పాఠం అయిపోయి, ఇంటికి వచ్చిన ఆ అసుర సంధ్య వేళ, ఇంకా వరండాలో దీపం వెలగడం లేదు. ముసిరీ ముసరని చీకట్లో నాన్న కోపంగా పేముకుర్చీలో కూచుని ఉన్నాడు. ఆయన చేతిలో ఒక కాగితం ఉంది. అన్నయ్య స్థంభానికి ఆనుకుని నిల్చుని ఏడుస్తున్నాడు. ఏమైందో అమ్మని అడుగు దామని లోపలికి వెళ్లాను. లోపల గదులన్నీ చీకటి. వంటిల్లు చీకటి.
‘అమ్మెక్కడికెళ్లింది నాన్నా?’ అంటే చెప్పలేదు. చేతిలో కాగితాన్ని వీలైనన్ని ముక్కలు చేసి కుప్పబోసి అగ్గిపుల్ల వెలిగించాడు. అన్నయ్య నన్ను కౌగిలించుకుని ఏడిస్తే నేనూ ఏడ్చాను. అమ్మెంతకీ రాలేదు. ఎవరూ అన్నం వండలేదు. మేం ఏడ్చి ఏడ్చి పడుకున్నాం. తెల్లవారేసరికి వంటింట్లో అత్తయ్య ఉంది. ఆవిడంటే నాకు ఇష్టం ఉండదు.
‘‘మా అమ్మ ఎక్కడికెళ్లింది?’’ అడిగాను.
‘‘ఏట్లోకి,’’ అందావిడ.
నన్ను స్కూలుకు వెళ్లమని నాన్న కోప్పడ్డారు. నాన్నంటే భయం కనుక వెళ్లాను. ఇంటికొచ్చేసరికి అమ్మ ఉంటే బాగుండును అనుకుంటూ వెళ్లాను. అట్లా రెండు, మూడు, నాలుగు రోజులు… ఉహా అమ్మ రాలేదు. నాకు జ్వరం వచ్చింది. అమ్మ స్పర్శ కోసం తపించాను. నిద్రలో ఏడ్చాను. మందు బిళ్లలు ఇచ్చిన అత్తయ్య చేతిని విసిరికొట్టాను. పదిరోజులకి జ్వరం తగ్గింది. దువ్వించుకోక అట్టగట్టిన తల నిండా లుకలుకలాడుతూ పేలు. బాగా చీరుకుపోయే దువ్వెన తెచ్చి అత్తయ్య బరబరా దువ్వింది. తలంతా మంట. అత్తయ్య అమ్మ గురించి చెడ్డమాటలన్నీ మాట్లాడుతోంది. తిడుతోంది. కర్ర పుచ్చుకుని ఆవిడ నెత్తిమీద కొట్టి వెళ్లగొడదామని పించింది.
‘‘మా ఇంట్లోనించి వెళ్లిపో,’’ అని దువ్వెన లాక్కుని ఆవిడ చేతిమీద కసికొద్దీ గీరాను. ఎర్రటి చారలలోనించి నెత్తురు వచ్చింది. ఆవిడ నన్ను కొడుతుందనుకున్నాను. నాన్నతో చెప్పి కొట్టిస్తుందనుకున్నాను. కానీ ఏమీ అనలేదు. కళ్లు తుడుచుకుంటూ నన్ను దగ్గరికి తీసుకుని, ‘‘నన్ను వెళ్లిపొమ్మంటే పోతాను. కానీ నే వెళ్లిపోతే ఇంట్లో ఆడదిక్కు కోసం మీ నాన్న ఇప్పుడే పెళ్లి చేసుకుంటాడు. ఆ వచ్చే ఆవిడ నీకిలా తల దువ్వదు. పేలు చూడదు. నువ్వు కసిరికొట్టినా బతిమిలాడి మందులు వెయ్యదు. నువ్వు పసిపిల్లవి. నిండా పదేళ్లు లేవు. నీకేమీ తెలీదు. ఒకటి మాత్రం నిజం. మీ అమ్మ ఇక రాదు. మిమ్మల్ని ఒదిలేసిపోయింది. మీ నాన్న రమ్మంటేనే వచ్చాను. నీకోసం…’’ అంది. అత్తయ్య కొడుకూ, కోడలూ ఎక్కడో దూరంగా ఉంటారు. ఆవిడొక్కతీ విజయవాడలో ఉంటుంది. వాళ్లతో ఆవిడకు పడదని అనేది అమ్మ.
‘‘అమ్మ నిజంగా రానేరాదా అన్నయ్యా?’’ అంటే అవునన్నాడు. నాకన్న నాలుగేళ్లే పెద్ద అయినా నన్నెంతో సముదాయించేవాడు. అన్నం తినకపోతే బతిమిలాడేవాడు. నెలరోజుల తరువాత బట్టలూ పుస్తకాలూ సర్దుకుని హైదరాబాద్‌లో ఒక హాస్టల్‌కి వెళ్లిపోయాడు. నాన్నా అత్తయ్యా పంపించేశారు. మగపిల్లవాడు బాగా చదవాలట. ఇక్కడుంటే చదవలేడుట. అప్పుడు నాకెవరూ లేరని ఎంత ఏడ్చానో!
నేను స్కూల్‌ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి గంపెడాశతో సరాసరి వంటింట్లోకి పోతాను అమ్మ వచ్చిందేమో అని. అమ్మ రాదు. ఏడుపొస్తుంది. అత్తయ్య ఇచ్చిన పాలు తాగకుండా ఏడుస్తూ వెళ్లిపోతాను. ముందు కోప్పడుతుంది. తరువాత బతిమి లాడుతుంది. కళ్లల్లో నీళ్లొస్తాయి ఆవిడక్కూడా. ఆవిడ్ని ఏడిపిస్తే నాకు బాగున్నట్టుం టుంది. ఆవిడే అమ్మని వెళ్లగొట్టిందని అప్పుడప్పుడూ అనుమానం వస్తుంది. ఆవిడ కళ్లల్లో నీళ్లు చూశాక బలవంతాన పాలు తాగేసి వరండాలో కూచుంటాను.
‘‘సంగీతానికి పోవే,’’ అంటుంది అత్తయ్య.
సంగీతం వద్దు. సౌందర్యా వాళ్లమ్మ మంచిది కాదు. అమ్మని గురించి అత్తయ్య లాగే మాట్లాడింది. ఆవిడ చెప్పే సంగీతం నాకిష్టం లేదిప్పుడు. స్కూల్లో షెటిల్‌ ఆడ్డం మానేశాను. క్వార్టర్లీ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులూ తప్పాను. నాన్నతో మాట్లాడ్డం తక్కువే. అయినా, ఇప్పుడాయన ఎవరితోనూ మాట్లాడ్డంలేదు. ప్రోగ్రెస్‌ కార్డు చూసిన రోజు నన్ను పిలిచాడు. కోప్పడకుండా కూచోమన్నాడు. బాగా చదువుకుంటే ఎంత మంచిదో చెప్పాడు. ఎంత చదువుకుంటే అంత చదివిస్తానన్నాడు. అమ్మని మర్చిపొమ్మన్నాడు. నేను ఆయన చెయ్యిపట్టుకుని వెక్కులుపెట్టి ఏడ్చాను. ఆయనకి కూడా ఏడుపొచ్చి నట్టుంది. అక్కడ్నించి వెళ్లిపోయాడు. అత్తయ్య నా వీపు నిమిరింది. మంచినీళ్లు ఇచ్చింది. అయినా అమ్మని ఎలా మర్చిపోతాను?
అన్నం తినేసి బయటికి పరిగెత్తే తొందరలో మూతి సరిగ్గా కడుక్కోకుండా అమ్మ పమిట కొంగుకోసం వెతుక్కుంటాను. సౌందర్య ఇంటి నుంచి తెచ్చి గేటుపక్క నాటిన సెంటుమల్లె మొక్కకి మొదటి గుత్తి వస్తే గంతులేస్తూ గదిలోకి పోయి అమ్మని పిలుస్తాను. స్కూలుకి వెళ్లే షూజ్‌ మాసిపోతే అమ్మ పాలిష్‌ పెడుతుందిలే అని వది లేస్తాను. టీచర్‌ తిట్టినప్పుడు గుర్తొస్తుంది అమ్మ లేదని. అప్పుడేడవకుండా ఉండడానికి చాలా కష్టపడతాను.
అన్నయ్య అచ్చంగా నా పేరుతోనే ఒక ఉత్తరం రాశాడు. అక్కడ బావుం దన్నాడు. మంచి స్నేహితులు దొరికారన్నాడు. అమ్మకోసం ఏడుస్తూ కూచోకుండా నన్ను కూడా బాగా చదువుకోమన్నాడు. అప్పుడప్పుడూ ఉత్తరాలు రాస్తానన్నాడు.
ఒకరోజు మర్చిపోయి అత్తయ్య పమిట కొంగుకి మూతి తుడిచాను. ఆవిడ వెనక్కి తిరిగి నా బుగ్గ మీద చిటికె వేసి నవ్వింది. ఆ వేసవిలో నాన్నకి ట్రాన్స్‌ఫర్‌ అయింది. అడిగి చేయించుకున్నాడని అత్తయ్య చెప్పింది. అక్కడ వాళ్లకి నన్ను తల్లిలేని పిల్ల అని చెప్పింది. అంటే మా అమ్మ చచ్చిపోయిందని అర్థం అన్నమాట. బాగా కోపం వచ్చింది నాకు.
‘‘మా అమ్మ చచ్చిపోలేదు. మళ్లీ వస్తుంది. అట్లా చెప్పావంటే ఊర్కోను,’’ అని అత్తయ్యని తిట్టాను. అత్తయ్య నవ్వి ఊరుకుంది. అత్తయ్యకి నేనంటే జాలిట. జాలి పడే వాళ్లతో నేను మాట్లాడను. కొత్త స్కూలు పిల్లలతో కూడా నాకు స్నేహం వద్దు. వాళ్లూ జాలిపడ్డారు. నాకు నచ్చలేదు. అసలెవరి స్నేహమూ వద్దు. నేను బాగా చదువు కుంటాను. క్లాసులో ముందుంటాను అనుకున్నాను. అలవాటైపోతోంది అమ్మలేకుండా ఉండడం. కానీ మర్చిపోలేను కదా అమ్మని. అద్దం చూసుకున్నప్పు డల్లా గుర్తొస్తుంది కదా. నా వంకీల జుట్టు, నా కనుబొమలు… నా ఒంటి రంగు అన్నీ అమ్మవే కదా. అసలారోజు నేను స్కూలుకు వెళ్లకుండా ఉంటే అమ్మ వెళ్లిపోయేది కాదేమో. గేట్లో నిలబడి చెయ్యి ఊపిన అమ్మ!
అత్తయ్యా, నేనూ, నాన్నా కొత్త ఊరికీ, కొత్తమనుషులకీ, కొత్త స్కూలుకీ అలవాటు పడుతూండగా నాన్న వారంరోజులు ఎక్కడికో వెళ్లాడు. వెళ్లబోతూ ఒక గొలుసు, ఒక జతగాజులూ (అవి అమ్మవి) అత్తయ్య చేతికిచ్చి నా కోసం దాచమన్నాడు. ఆవిడెందుకో దిగులుగా కనిపించింది. ఊరినించి నాన్నతో పాటు ఒకావిడ కూడా వచ్చింది, పెద్ద సూట్‌కేసుతో.
ఆవిడని ‘అమ్మ అనుకో’మన్నాడు నాన్న. ‘నేను చచ్చినా అనుకోను’ అని నా మనసులో నిర్ణయించేసుకున్నాను. అత్తయ్య బట్టలు సర్దుకుంటోంది ఒకరోజు. ఎక్కడి కత్తయ్యా అంటే మా ఇంటికి అంది. నేను ఆవిడ్ని చుట్టుకుని ‘నేనూ వస్తా’ అని ఏడ్చాను. స్కూల్‌ పోతుంది, వద్దన్నాడు నాన్న. అమ్మకోసం, అత్తయ్యకోసం బెంగపడి మళ్లీ జ్వరం తెచ్చుకున్నాను. చచ్చిపోదామనిపించింది. అత్తయ్య వచ్చి నన్ను తీసుకు పోయింది. నేనూ ఆవిడకి అంటుకుపోయాను. అత్తయ్య నన్ను స్కూల్లో చేర్చింది. అన్నం తిని చెయ్యి తుడుచుకోడానికి తువ్వాల అందుకోబోతే పమిటకొంగు చాపింది. కంచం తీసి సింక్‌లో వెయ్యబోతే ‘నేను లేనా?’ అంది. నా తల దువ్వి జడ వెయ్యడానికి మెత్తగా ఉండే మంచి దువ్వెన కొనుక్కొచ్చింది.
వారం వారం కుంకుడుకాయలతో తలంటుపోసింది. సినిమాకి తీసుకువెళ్లింది. తన పక్కలో పడుకోబెట్టుకుంది. అయినా నేను తలకు నూనె పెట్టాక తలంటికి అంద కుండా అమ్మని ఇంటి చుట్టూ పరిగెత్తించినట్లు అత్తయ్యని పరిగెత్తించలేను. అన్నానికి రమ్మంటే, ‘ఇదిగో ఇప్పుడే వస్తా,’ అంటూ బయటికి పారిపోలేను. పాలు తాగిన గ్లాసు ముందుగదిలో కిటికీలో పడేసి అమ్మకి ఉత్తుత్తి కోపం తెప్పించినట్టు అత్తయ్యకి తెప్పించలేను. కోపంవస్తే మళ్లీ నాన్న దగ్గరకి ‘అమ్మ అనుకోమన్న’ ఆవిడ దగ్గరకి పంపిస్తుందేమో అనిపించి అత్తయ్య చెప్పినట్టు వింటాను. పీడకలొచ్చినప్పుడో, ఉరుములొచ్చినప్పుడో, కరెంట్‌ పోయినప్పుడో ఆవిడ డొక్కలో దూరాలని దగ్గరగా జరగబోయి మళ్లీ వెనక్కి జరుగుతాను. ఆవిడే దగ్గరకు లాక్కుంటుంది. అమ్మ అనుకో మని నాన్న తీసుకొచ్చినావిడ గుర్తొచ్చి అత్తయ్యకి మరింత దగ్గరగా జరుగుతాను. అమ్మ స్పర్శ లేకపోయినా అత్తయ్య స్పర్శ పరవాలేదని అనిపిస్తుం దప్పుడు.
‘తల్లిలేని పిల్లని ఇంత బాగా ఎవరు చూస్తారమ్మా,’ అనేవాళ్లు అందరూ. నిజమే కదా అనుకునేదాన్ని. అత్తయ్యకి కోపం తెప్పించకూడదని అనేవాళ్లు అందరూ. నిజమే కదా మరి! స్కూలుకి పంపిస్తోంది. తన స్వంత కూతుర్లా చూస్తోంది కదా. అత్తయ్య మంచిదే. అయితే మాత్రం అమ్మని ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. అదే నాకు నచ్చదు. ఆ మాట అనకుండా అవతలికిపోవడం నేర్చుకున్నాను.

స్కర్ట్‌ వెనక అంటిన నెత్తురు మరక చూసుకుని భయపడి ఇంటికి పరిగెత్తుకు వచ్చి ఏడుస్తున్నప్పుడు నవ్వేసి ఆ మరకేమిటో చెప్పి నువ్వింక అలా చీటికీమాటికీ ఏడవకూడదు. నువ్విప్పుడు పెద్దదానివి. నా బంగారుతల్లివి అని ఓదార్చి వేడుకలు చేసి కొత్త బట్టలు కొనిచ్చినా ఆమెలో మా అమ్మ కనపడలేదు నాకు. కానీ అత్తయ్యకి నేనంటే ఇష్టం. ఆ ఇష్టం వల్లనే నేను బతికున్నాను. చదువుకుంటున్నాను. ఫరవాలేదు అత్తయ్య ఉంది నాకు అనిపించిందప్పుడు. నాకొక తమ్ముడూ ఒక చెల్లీ అని తీసు కొచ్చారప్పుడు నాన్నా, అమ్మ అనుకోమన్నావిడా. ఆవిడని అమ్మ అనీ, వాళ్లని తమ్ముడూ, చెల్లీ అనీ నేనెప్పటికీ అనుకోను అనేసుకున్నాను. ఆవిడ నాకు కొత్త బట్టలు తెచ్చింది. తల నిమిరింది. ఆవిడ నాకు సవతి తల్లి. సవతి తల్లులకు మేము ఇష్టం ఉండం అని చాలామంది చెప్పారు అత్తయ్యతో సహా. అందుకని ఆవిడ నాకు కొత్త బట్టలు ఇచ్చినా, తల నిమిరినా నాకు నచ్చలేదు.

‘‘మరొక్కసారి మీ గొంతులతో ఆమెని పిలవండి. పిల్లల గొంతులు తల్లిని కదిలిస్తాయి. ఇలా అనండి ,‘అమ్మా నువ్వు లేకుండా మేం ఉండలేం. ఈ సముద్ర తరంగాలు మమ్మల్ని భయపెడుతున్నాయి’ అని పిలవండి…’’ అని తల్లికోసం మరొక ప్రయత్నం చేయిస్తున్నాడు మెర్మన్‌.
‘‘మన సాగర గర్భ సామ్రాజ్యంలో స్వర్ణ సింహాసనం మీద మహారాణిలా కూచుని తన ఒళ్లో చిన్నదాన్ని కూచోబెట్టుకుని దాని తల దువ్వింది నిన్ననే కదా… అప్పుడే కదా చర్చి గంట మోగింది…’’ అని తలపోసుకుంటున్నాడు.
అనురాధా టీచర్‌ ఏ పాఠం చెప్పినా అందులో లీనమైపోతుంది. తనే మెర్మన్‌ అయినట్లూ ఆ మానవకాంత తననే వదిలేసి వెళ్లినట్లూ గద్గద స్వరంతో చెబుతోంది. తండ్రినీ పిల్లలనూ వదిలి వెళ్లిన ఆమెను గురించి మెర్మన్‌ అనే మాటలు, ‘‘హియర్‌ కేవ్‌ు ఎ మోర్టల్‌, బట్‌ ఫెయిత్లెస్‌ వజ్‌ షి’ (నవతీవ షaఎవ a ఎశీత్‌ీaశ్రీ, పబ్‌ టaఱ్‌ష్ట్రశ్రీవరర పబ్‌ రష్ట్రవ). నేను వింటున్నాను. నా చెంపలు తడిసిపోతున్నాయి. పాఠం చివరికొచ్చింది. ఆఖరి లైను ‘దేర్‌ డ్వెల్స్‌ ఎ లవ్డ్‌ ఒన్‌. బట్‌ క్రూయెల్‌ ఈజ్‌ షి (్‌ష్ట్రవతీవ సషవశ్రీశ్రీర a శ్రీశీఙవస శీఅవ, పబ్‌ షతీబవశ్రీ ఱర రష్ట్రవ) టీచర్‌ చెబుతూ ఉండగానే బెల్‌ మోగింది. నేను పుస్తకాలు పట్టుకుని ఒక్క అంగలో బయటపడి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాను.
బట్‌ క్రూయెల్‌ ఈజ్‌ షి. అవును! క్రూయెల్‌ ఈజ్‌ షి … క్రూయల్‌ ఈజ్‌ షి… అత్తయ్యతో వచ్చేటప్పుడు తెచ్చుకున్న అమ్మ ఫోటోను కోపంగా వచ్చి నేలకేసి కొట్టాను. మళ్లీ ఆ కాగితం తీసుకెళ్లి లామినేషన్‌ చేయించుకొచ్చాను, పగలగొట్టే వీలు లేకుండా. కానీ దాన్ని పెట్టె అడుగున పడేశాను. బాగా ఏడ్చాను. క్రూయల్‌ ఈజ్‌ షి… అన్నయ్య అంత నిబ్బరంగా ఎలా ఉంటాడు? నేను ఆమెకోసం ఏడ్చాను. బెంగపడ్డాను. ఆక్రోశిం చాను. ఆమెపైన ఆగ్రహించాను. కానీ మర్చిపోలేను ఆమెని. ఆమె నా నీడ. కాసేపు పొడుగ్గా కాసేపు పొట్టిగా కాసేపు అసలే లేనట్లుగా నన్ను వెంటాడే నీడ. ఆమె నా తల్లి. నన్ను తల్లి లేనిపిల్లను చేసిన తల్లి. నా బాల్యాన్ని కన్నీటి సముద్రం చేసిన తల్లి.
దమయంతమ్మ ఎక్కడికి వెళ్లిందో ఎందుకు వెళ్లిందో కొంచెం కొంచెం అర్థం అవుతున్నప్పుడు అన్నయ్యకి రాసాను, ‘అమ్మకి మనమీద కన్న ఆ వ్యక్తి మీదే ఎక్కువ ప్రేమా? మనని అసలు ప్రేమించలేదా? పోనీ మనని కూడా తీసుకుపోకూడదా?’ అని.
అన్నయ్య ఇలా జవాబిచ్చాడు. ‘అమ్మ అనుకోమన్నావిడని చచ్చినా అనుకోనని చెప్పావు కదా. మరి నాన్న అనుకోమన్నాయనని నాన్న అనుకోగలవా? ఎక్కడున్నా మనకి ఉండేది ఒక్క మనిషే కదా. మరొక ఆలోచన పెట్టుకోక బాగా చదువుకో…’
….
‘‘నా కాళ్లకి చుట్టుకుని నువ్వు ఏడ్చినరోజు నిన్ను తీసుకొస్తూ ఇంతకాలం ఉంచు కుంటాననుకోలేదు. మనిద్దరం ఇట్లా అతుక్కుపోయాం. ఇంట్లో తిరిగే ఆడపిల్ల ఎంత జీవమిస్తుందో నాకు అర్థం అయింది. నిన్ను తెచ్చినందుకు నా మాట దక్కించి ఇంత దానివయినావు. వెళ్లి మీ నాన్నకి కనపడి ఆశీర్వాదం తీసుకుని వచ్చి ఉద్యోగంలో చేరు. వాడు నీ తండ్రి. ఆ పిల్లలకేవైనా కొనుక్కు వెళ్లు. ఆవిడకీ మీ నాన్నకీ బట్టలూ…’’ అని నన్ను నాన్న దగ్గరకు పంపింది అత్తయ్య. అప్పుడు అడిగాను ఆయన్ని ఆఖరిసారి, ‘అమ్మెందుకు వెళ్లిపోయింది నాన్నా. నువ్వామెను సరిగ్గా చూసుకోలేదా? ఆమె రాసి పెట్టిన ఉత్తరం ఎందుకు చించేశావు? అదుంటే మాకూ తెలిసేది కదా.’
నా వయసు నాకు కాస్త ధైర్యం ఇస్తే, ఆయన వయసు ఆయన్ని కాస్త మెత్తబరచి నట్లుంది. చుట్టూచూసి నన్ను, ‘అమ్మ అనుకోమన్న’ ఆమె అక్కడ లేదని ఖాయ పరచుకుని, ‘‘నేను భూలోకపు మనిషినమ్మా. ఆమె ఊర్థ్వలోకపు మనిషి. అందుకే ఈ లోకంలో ఉండలేక వెళ్లిపోయింది. అంతకన్న చెప్పడానికేం లేదు,’’ అన్నాడు.
ఒక ఊర్థ్వలోకపు మనిషి ఆమెను, ‘ఆవో హుజూర్‌… తువ్‌ు కో సితారోఁ మే లే చెలూఁ’ అని నక్షత్రవీధిలోకి నడిపించుకుపోయాడు. అక్కడైనా ఆమె తను కోరుకున్న ప్రేమ పొందిందా? ఎట్లా తెలుస్తుంది నాకు?

చదువుతున్న పుస్తకంలో లీనం కాలేనప్పుడూ, నిద్ర నాతో చెలగాటమాడే టప్పుడూ సరిగ్గా అప్పుడే అట్లాంటిక్‌ తీరం నుంచి అన్నయ్య పిలుస్తాడు. నాతో ఎప్పుడు మాట్లాడాలో వాడికే తెలుసు.
‘‘విశేషాలేమిట్రా అమ్మడూ?’‘ అన్నాడు.
‘‘నేను దమయంతి కూతుర్నయినప్పటికిన్నీ పెద్దవాళ్లని కన్విన్స్‌ చేసి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు ఒకానొక సంతోష్‌ ఫ్రవ్‌ు సామర్లకోట, అఫ్‌కోర్స్‌… నా ప్రవర్తన గురించి విచారించుకొచ్చాడనుకో,’’ చెప్పాను.
‘‘ఇంకేం మరి. అనుగ్రహించాడు కదా. శుభం. నీ మొహాన పెళ్లిబొట్టుతో పాటు ఒక తల్లిమచ్చ కూడా పెట్టేసి, ఆ మచ్చని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినవాడు. నువ్వు నీ జీవితాంతం అతనికి కృతజ్ఞతాబద్ధురాలివై ఉంటావు. ఎప్పుడైనా నీ చదువూ నీ తెలివీ నీ ఉద్యోగం గుర్తొచ్చి నువ్వు ఎగిరిపడితే ఆ తల్లి మచ్చ ఒక పేపర్‌ వెయిట్‌లా పని చేస్తుంది…’’ నవ్వాడు.
నేను మళ్లీ మొదటికొచ్చాను, ‘అమ్మ మనని ఎట్లా మర్చిపోయిందన్నయ్యా?’ అంటూ. వాణ్ణి అట్లా అడిగి కాస్త తత్వబోధ చేయించుకోవడం బాగుంటుంది నాకు. నా అరిగిపోయిన ప్రశ్నా, వాడి ఎప్పటి జవాబూ … నిబ్బరంతో నిండిన వాడి కంఠం.
‘‘మర్చిపోయిందని ఎందుకనుకుంటావు? మనలాగే తనూ గుర్తు చేసుకుంటూ ఉండచ్చు కదూ!
‘‘తన జీవితాన్ని మలుచుకునే హక్కు ఆవిడకుంది కదా అమ్మడూ. మనకోసం ఆమెకి అలవిమాలిన త్యాగాలు అంటగట్టకూడదు కదా. ఆమె ఎందుకు ఏ పరి స్థితుల్లో మనని వదిలి వెళ్లిందీ మనకెప్పటికీ తెలియదు, ఆమె చెబితే తప్ప. ఇంక వదిలేయ్‌. ఎక్కడున్నా ఆమె బాగుండాలనుకో…’’
‘‘మరి నేను అనుభవించిన క్షోభ మాటేమిటి?’’’
‘‘బహుశా మన దగ్గరే ఉండి ఉంటే ఆమె అనుభవించవలసి ఉండిన క్షోభ మాటేమిటి?’’’
నా దగ్గర జవాబు లేదు. ఆమె దగ్గరేం జవాబు ఉందో?!

AKSHRA
error: Content is protected !!