పంటకాల్వ

దర్భశయనం శ్రీనివాసాచార్య

మహాసముద్రాలు మహాద్భుతాలే కావచ్చు
నేను మాత్రం
ఈ పంటకాల్వకు మోకరిల్లుతాను
దాని పక్కన ఇష్టచిత్తంతో
కదుల్తాను
నా నీడను అది హత్తుకున్న క్షణాల్లో
పరవశ కాంతితో తడిసి వరిపైరునవుతాను

దాని మెత్తని చప్పుడుకు
నా గుండె చప్పుడును జతచేస్తాను
ఒక జుగల్బందీ!
కదలికల లలిత గానాల
మిలమిలల గలగలలు
పాఠాలు పాఠాలై
నన్ను దీవిస్తాయి
పొలం సాక్షిగా వినయ విద్యార్థి నవుతాను

దాని మలుపుల యలుకు
నా కన్నులు సొగసుల సారంతో
పండిన ధాన్యక్షేత్రాలవుతాయి
చూపున్నదిందుకే కదా ఆని మురుస్తూ
ఫలపుష్పసంరంభంతో సౌందర్యచిత్తుణ్ణవుతాను

దాని చెలిమి చేర్పుతో
మొక్కలు అనారోగ్య కాంతులీనుతున్నప్పుడు
చేవతో చిక్కగా నిగనిగలాడినప్పుడు
సకల లోకానికి ఆశీస్సులందుతున్నట్లు
పులకిస్తాను
బతుకు ధన్యత అంటే ఏమిటో
దీని సమక్షంలో బోధపడుతూంటే
జలమనస్కుణ్ణవుతాను

దయచేసి నేనెవర్నో ఇవాళ అడగండి
పంటకాల్వకు అనుంగు అనుచరుణ్ణని
చెప్పుకుని కరిగిపోతాను

AKSHRA
error: Content is protected !!