Sri Sri’s poem

 

Sri Sri

Srirangam Srinivasarao

(1910-1983)

Sri Sri is an eminent Telugu poet who moved the Telugu poetry forward by opting to write on contemporary issues than mythological themes. He used a metre which was not used in classical Telugu poetry. He is considered as a pioneer of protest poetry. His poems are the voice of the voiceless

To read the English Translation of the poem:

http://www.akshra.org/bull-in-the-city/

To read the Tamil Translation of the poem:

http://www.akshra.org/%e0%ae%a8%e0%ae%95%e0%ae%b0%e0%ae%a4%e0%af%8d%e0%ae%a4%e0%af%81%e0%ae%95%e0%af%8d-%e0%ae%95%e0%ae%be%e0%ae%b3%e0%af%88/

చెరువొడ్డు

నందిని సిధారెడ్డి

తొలికిరణం
చెరువును రంగరించి
ఒడ్డును పుదిస్తది
ఆ కడ
కండ్లు నులుముకుంటూ
జీవితం జిగేల్‌మంటది
మొలిసీ మొలవని
గడ్డిని బర్లు బంతి పడితే
కాపర్లు గోనెతో
లోకాలు కొలుస్తరు
బరువు దించుకొనెతందుకు కూచున్న
బసుగు పొదలోంచి
బాబాసెహెగల్‌ విచిత్రం వినిపిస్తడు
కుటుంబాన్ని పోషిస్తున్న
అందాల ఆటోకు లాలపోస్తూ
అతనొక పులకింత
బురద చేతుల్తో
పొలంలో డైరీ రాస్తున్న రైతు
బట్టలమురికి వదిలించెతందుకు
బండమీద కరుగుతున్న యౌవనం
వెనక కూచుని నేర్పుతూ ఆయన
కొత్త ప్లెజర్‌ నడుపుతూ
టెన్షన్‌కూ ప్లెజర్‌కూ నడుమ ఆవిడ
ఆపూట
బతుకుబాటకు
వేషం వేసుకుంటున్న బావాజోడు
చల్లారిన బూడిదలోంచి
ఒక్కొక్కటే బొక్కలేరుతూ
కుండలో వేస్తున్న వారసులు
శరీరం తీరని మోహం
మెల్లగ ఉరుకుతూ కొందరు
వేగంగ నడుస్తూ కొందరు
ఎప్పటి సందడి అప్పటిదే
ఎవల ఆరాటం వాళ్లదే
ఒక కొసన ఎగిరి
ఒక కొసన వాలొచ్చు
ఒక దగ్గర మొదలై
ఒక దగ్గర ముగియొచ్చు
ఏదయినా జీవితమే
పరుగులు
పరవశాలు
దుఃఖాలు చూసిన ఒడ్డు
కాలాలు
కల్లోలాలు
కారిÄన్యాలు భరించిన ఒడ్డు
మునుగుతది తేలుతది
నానుతది ఎండుతది
ఆ ఒడ్డు
పొద్దున సందడి
రాత్రి ఒంటరి

 

వికృతి

దేశరాజు

పసిపాప నవ్వింది
పుప్పొడి రాలింది

లేత పెదవి విచ్చింది
పాలోసుకుని వరికంకి పొంగింది

చిట్టిచిట్టి చేతులతో మబ్బుల్ని నిమిరింది
నీటి తడి నేలను తడిమింది

నింగి ఇంద్రధనస్సును ఎక్కుపెట్టింది
బోసి నోరు తొలి శబ్దం విడిచింది

నెలబాలుడికి అరికాలు తాటించింది
వెన్నెలసోన సొగసులిడిచి సోలిపోయింది

కిలకిలమని కనురెప్పలు అల్లార్చిచింది
రేయి పగళ్లకు కొత్త సమయాలు నిర్ణయించింది

పాపాయిని పెనవేసుకుంది ప్రకృతి
ప్రకృతికి ప్రాణ వాయువులు ఊదింది పాపాయి

-అవును, పిల్లలే ప్రకృతి, ప్రకృతే పిల్లలు
మనమే,
చేజేతులా వారిని మనుషుల్ని చేస్తాం

ఒంటరి ఏకాంతం

కొట్టం రామకృష్ణారెడ్డి

సికింద్రాబాద్‌ నుంచి అయిదుంపావుకి గోదావరి, అరగంట ముందే చేరుకున్నాను స్టేషన్‌కి, టికెట్స్‌ అన్నీ ముందే ఆన్‌లైన్లో రిజర్వ్‌ చేసు కున్నాను కాబట్టి ఫరవాలేదు.
అయినా ఇదేమైనా కొత్తా? గత ముప్పై అయిదేళ్ల నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏటా ప్రయాణిస్తున్న రెగ్యులర్‌ ప్రయాణీకు డిని. క్రిక్కిరిసిన జనాలని తప్పుకుంటూ, తప్పించుకుంటూ ఆల్పాÛ హోటల్లో టీ తాగి బయటికొచ్చాను. అరటిపళ్లు, నీళ్ల బాటిల్‌ కొని ప్లాట్‌ఫావ్‌ు పైకి అడుగుపెట్టాను.
ఇంకో పావుగంట టైముంది రైలు కదలడానికి, నేనెక్కాల్సిన ఎస్‌3 కోచ్‌ ముందు నిల్చుని చుట్టూ పరికించాను. ఇంతమంది ఎందుకు రోజూ ఇలా పరుగులు పెడుతూ ప్రయాణిస్తూంటారు. అందరూ అవసరార్థమే ప్రయాణిస్తారు.
ఏ అవసరాలు ఇలా పరుగులు పెట్టిస్తాయి? ఎక్కడికి ఏ ప్రయాణం చేసినా, చివరికి ఇంటికే కదా చేరుకునేది!
కానీ, నాలాగా ప్రయాణించేది కేవలం నేనొక్కడినే. ప్రతి ఏటా తప్పని ప్రయాణం, తిరుగు ప్రయాణం అయ్యేవరకు ఉత్కంఠను రేకెత్తించే ప్రయాణం. ప్రతి సంవత్సరం ఈ ప్రయాణం మానెయ్యాలనే ప్రయత్నం, మానలేను. ఆమెను కలవకుండా ఉండలేను. నేను వెళ్లకపోతే, నానా యాగీ చేస్తుంది. నా లోలోకి దూసుకొచ్చి ఊపిరి ఆడకుండా చేస్తుంది. స్థిమితంగా కూర్చోనివ్వదు, నిల్చోనివ్వదు.
ఒక్క రాత్రే కదా తనతో గడిపేది. సంవత్సరానికి ఒక్కరోజు, తనని తృప్తిపరచాలి, సంతోష పెట్టాలి, కబుర్లు చెప్పాలి. తను చెప్పింది వినాలి.
ఆ ఒక్కరోజూ గడిపితే… మళ్లీ మూడువందల అరవై నాలుగు రోజులు నా కోసం, ఆశగా ఎదుర్చూస్తుంది.
ప్రపంచంలో ఎక్కడున్నా నేనా రోజు వస్తానని తెలుసు. తనని నిరాశపరచలేను.
రైలు కదుల్తూంది. సీట్లోకొచ్చి కూర్చున్నాను. లోయర్‌ బెర్త్‌, ఈ ఫెసిలిటీ బావుంటుంది. అరవై దాటితే ఛార్జీల్లో రాయితీలూ, లోయర్‌ బెర్త్‌ అలాట్‌మెంట్లూ!
స్లీపర్‌ క్లాస్‌లోనే కొంచం కోలాహలంగా ఉంటుంది. ఒకరినొకరు పలకరించు కుంటారు, కలసి ప్రయాణిస్తారు. ఏసీలో ఒంటరితనపు ఉక్క పోస్తుంది. ఊపిరి ఆడదు. యంత్రాలు ఊపిర్లు పీల్చవు, చల్లగా ప్రయాణిస్తాయి ఒంటరిగా. ఈ ప్రయాణీకుల సమూహం కనీసం ఒంటరితనాన్ని పారద్రోలడానికి సహాయపడుతుంది.
శివార్లు దాటింది రైలు. వాతావరణం చల్లగా ఉన్నది. కిటికీలోంచి చూస్తే… సూర్యుడు రైలు వెంటబడ్డాడు. అస్తమించే ముందు కూడా ఈ ఆయాసమెందుకో?
వయసుడిగి పోయాకే కోరికలు రెక్కలు విప్పుతాయంటారు. నిజమే కాబోలు?
అనుక్షణం ఆమె జ్ఞాపకమే నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఊపిరి సలప నివ్వదు. ఆ ఒక్కరోజు నేను వెళ్లకపోతే ఏం చేస్తుంది? తట్టుకోగలదా? ఎంతలా ఎదుర్చూస్తుంది నాకోసం! నేను రాలేదని తెలిసిన మరుక్షణం, నా కోసం రూఢీగా బయలుదేరుతుంది, నాకు తెలుసు.
నా నుంచి ఏదీ ఆశించదు. కేవలం నా సాంగత్యం కావాలని కోరుకుంటుంది. ప్రతి సంవత్సరం డిసెంబరు నెల పౌర్ణమి రోజున తప్పక రమ్మంటుంది. రానంటే బ్రతిమిలాడుతుంది, బామాలుతుంది, కుదరకపోతే బెదిరిస్తుంది. ఆఖరికి భయపెడుతుంది, ఎలాగైనా నన్ను తన వద్దకు రప్పించుకుంటుంది. ఆరోజు కోసమే సంవత్సరమంతా కళ్లు కాయలు కాసేలా ఎదుర్చూస్తుంది. ఆమె కోరికని కాదనలేని అశక్తత నన్ను ఆవరిస్తుంది.
చీకటిపడింది. రెండరటిపళ్లు తిని నీళ్లు తాగి పడుకున్నాను.
కళ్లు మూసుకుని పడుకుంటే, రైలు కుదుపులకు మెదడులోని జ్ఞాపకాల అరలు, పొరల్లా విడిపోవడం మళ్లీ మొదలయ్యింది.
హఠాత్తుగా విరగబడి నవ్వుతుంది, గుండెలు బిగపట్టుకుని చూసేవాడ్ని తన నవ్వుని. అంతే హఠాత్తుగా ఆపేసి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఏమని ఓదార్చగలను? ఎలా ఆదుకోగలను? ఆదుకోవలసిన సమయంలోనే అవకాశం ఉండీ ఆదుకోలేదే? ఇప్పుడేం సహాయం చెయ్యగలను? ఎలా సేద తీర్చగలను? నేరుగా తన కళ్లలోకి కూడా చూడలేని పిరికివాడ్ని. తనకు సాంత్వన ఎలా కలిగించగలను? నేలచూపులు చూస్తున్న నన్ను గుచ్చి గుచ్చి చూస్తుంది. తన చూపులని గుండెల్లోకి చొప్పించి కెలికి పారేస్తుంది.
చాలా సార్లు చెప్పాను- ఇక రాలేనని, వయసు, ఆరోగ్యం సహకరించడం లేదని.
విశాలంగా నవ్వేది. నవ్వి, ‘నువ్వెందుకు కష్టపడతావు చెప్పు, నేనే వస్తాను నీ దగ్గరకు,’ అనేది.
నిశ్శబ్దంలో కూరుకుపోయేవాడిని. తను నా వద్దకు వస్తే ఇంకేమైనా ఉందా? నన్ను పిచ్చివాడి కింద జమకట్టి గేలి చేస్తారు. పరిహాసాలాడ్తారు. చులకనగా చూస్తారు.
పిచ్చెక్కిందని సైకియాట్రిస్ట్‌కి చూపెడతారు, ఆఖరికి భూతవైద్యుడ్ని పిలి పిస్తారు. తన దగ్గరకి వెళ్లడం మాత్రం మానలేదు. మానలేను. మానను. తనను నిరాశకు గురి చెయ్యలేను. లయబద్ధమైన శబ్దానికీ, కుదుపులకీ, చల్లటి గాలికీ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను. ఒంటరిగా.

సరైన సమయానికే విశాఖపట్నం చేరుకుంది రైలు.
రిటైరింగ్‌ రూంలో ఫ్రెష్‌ అయ్యాను. కిరండోల్‌ పాసెంజర్‌కి టికెట్‌ తీస్కుని, కేఫెటేరియాలో రెండిడ్లీలు తినేసరికి రైలొచ్చి ఆగింది ప్లాట్‌ఫారవ్‌ు మీద.
కిటికీ పక్కన సింగిల్‌ సీట్‌ సంపాదించాను. కాళ్లు చాచి చేరగిలబడి కూచుని కిటికీలోంచి శూన్యంలోకి దృష్టి సారించాను.
జ్ఞాపకాలు దారి చేసుకుంటున్నాయి. రిపబ్లిక్‌ డే పరేడ్‌లోని సైనిక కవాతులాగా లయబద్ధంగా, క్రమబద్ధంగా ఒకదాని వెనకొకటి ముందుకు వేగంగా చొచ్చు కొస్తున్నాయి. వాటిని నియంత్రించలేని నిస్సహాయుడ్ని.
తన వద్దకు వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతుందనగా మొదలవుతుంది నాలో అలజడి. ఈ నాలుగయిదు నెలలూ గిలగిలా తన్నుకుంటాను. వెళ్లవద్దని నిశ్చయించు కుంటాను, మరుక్షణం సమాయత్తమవుతుంటాను.
చిత్రవధ అనుభవిస్తాను. నిశ్చింత కోల్పోతాను. ఎవరితోనూ పంచుకోలేని వేదన, యాతన.
ఒంటరిని, ఏకాకిని. సమూహంలోంచి వెలివేయబడితే అది ఒంటరితనం. అదే సమూహాన్ని వెలివేస్తే అది ఏకాంతం.
ఒంటరితనం భయపెడుతుంది. ఏకాంతం పునరుజ్జీవింపచేస్తుంది.
సమూహం వెలివేయలేదు. నేను సమూహాన్ని దూరం చేసుకోలేదు. దగ్గరా చేసుకోలేదు. పాక్షిక ఒంటరితనం, పాక్షిక ఏకాంతం. రెండూ కలిసినా అసంపూర్ణం. శూన్యాన్ని కూడా దరిచేర్చుకోలేనివాడ్ని.
ఒక్కసారిగా కిటికీ బయట చీకటి అలుముకుంది. నిశ్శబ్దంలో రైలు శబ్దం గొంతు చించుకుంది. కొద్దిసేపటికి మళ్లీ కిటికీ ముందు వెలుతురు వెల్ల వేసింది. టన్నెల్‌ దాటాము. దూరంగా పచ్చటి కొండలు కళ్లకు ఉపశమనం కలిగిస్తున్నాయి.
ఎత్తుకు ఇంకా… ఇంకా ఎత్తుకు ఎగబాకుతుంది రైలు, లోయల్ని దాటు కుంటూ మలుపులు తిరుగుతూ జలపాతాలని ఆవిష్కరిస్తూ. ప్రకృతిలో మమేకం అయిపోయాను. అప్పటివరకూ అలజడిలో కొట్టుమిట్టాడుతున్న నేను స్థిమితపడ్డాను.
పెద్ద మలుపు తిరుగుతూ, నెమ్మదిగా ఆగిపోయింది రైలు. అల్లంత దూరంలో చిన్న బ్రిడ్జి. తరువాత ఏదో స్టేషను కనిపిస్తూంది. బ్రిడ్జి మీద కొందరు గ్యాంగ్‌మెన్లు పనిచేస్తున్నారు. వారికి దగ్గరగా పాతిన ఎర్రజండా రెపరెపలాడుతున్నది. రిపేరు అనుకుంటా.
పది… పదిహేను… ఇరవై నిమిషాలు. ‘ఇంకాస్త సమయం పట్టేటట్టుంది,’ అని రైలు దిగి పరిశీలిస్తున్నవారు మాట్లాడుకుంటున్నారు.
మెల్లిగా కిందికి దిగాను. పట్టాలకు పక్కగా నాలుగడుగులు వేస్తే… అక్కడి నించి లోయ. లోతుగా. సుమారు మూడ్నాలుగువందల అడుగుల లోతు లోయ. చుట్టూ కొండలు. మధ్యలో లోయ, లోయ అడుగున నీటిచెలిమెలా మంచు పరుచు కుని కొలనును తలపిస్తూంది. కళ్ల ముందు అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడింది. ఆ పొగమంచు కొలనులో మధ్యలో ఒక పెద్ద వృక్షం నిశ్చలంగా నిలబడి ఉన్నది. ఒంటరిగా.
పై నుంచి చూస్తే చిన్న చెట్టులా కనిపిస్తూంది. ఎందుకో దాన్ని చూస్తే దిగులు కమ్ముకుంది.
గార్డు పచ్చజండా ఊపుతూ… విజిలేశాడు. కూడదీసుకుని రైలెక్కాను.
పెట్టె నిండా జనం ఉన్నా, ఒంటరితనం మహమ్మారిలా నన్ను ఆవహించింది.

రెండుగంటలు ఆలస్యంగా చేరుకుంది రైలు ‘అరకు’కు.
బ్యాగు చేతబట్టుకుని మెల్లిగా దిగాను. మధ్యాహ్నం దాటినా వాతావరణం చల్లగా ఉంది. చుట్టూ చూసాను.
ఎగ్జిట్‌ గేటు బయట ఎప్పుడూ నిల్చునే ప్రదేశంలోనే నిల్చుని ఉన్నాడు అతను! ఆమె భర్త. భావరహితంగా చూశాడు నన్ను. అతడ్ని చేరుకున్నంతలో, దారి తీస్తూ ముందుకడుగేసాడు. ఎప్పటిలాగే అనుసరించాను.
పంచ గోచీ పెట్టుకుని, చేతుల బనీనుతో, సుమారు నా వయసుంటుం దతనికి. సన్నగా బలంగా ఉన్నాడు. నాలుగడుగులు వేసాక, ఒక ఆటో వచ్చి అతని పక్కన ఆగింది. ఆటో డ్రైవరు పక్కన కూచున్నాడు. నేను వెనక కూర్చున్నాను.
ఆటో సుమారు మూడు కిలోమీటర్లు ప్రయాణించి మెయిన్‌ రోడ్డు పక్కగా, పోలీస్‌స్టేషనున్న సందులోకి తిరిగి, దాన్ని దాటి నాలుగు ఫర్లాంగులు ముందుకెళ్లి ఒక కొత్తగా సున్నం వేసిన పాత గెస్ట్‌ హౌస్‌ ఆవరణలోకి అడుగుపెట్టింది. సుపరిచిత ప్రదేశమే. నా నరాల్లో రక్తప్రసరణ వేగం పెరగడం నాకు తెలుస్తూనే ఉంది.
అతను ఆటోవాడిని పంపించేసి ప్రధాన ద్వారం వైపుకి దారితీసాడు. వెనకే నేను. పెద్ద తలుపుకున్న గొళ్లం తీసి నిల్చున్నాడు. నేను లోపలికి ప్రవేశించాను. అలాగే ఉంది గది. కొత్తగా సున్నం వేసినందుకు కాబోలు, గోడలు కాస్త ప్రకాశవంతంగా ఉన్నాయి. రక్తం ఉరకలు వేసే వయసులో నా స్నేహితుడు చేసిన చీకటి అరాచకానికి ఘనీభవించిన సాక్ష్యాలు నాతోపాటు ఈ గోడలు.
తెల్లటి దుప్పటి కప్పిన డబల్‌కాట్‌ బెడ్డూ, పక్కగా రెండు కుర్చీలు, టీ పాయ్‌. మూలగా పురాతన వార్డ్‌రోబ్‌ నానుకుని డ్రస్సింగ్‌ టేబుల్‌. కొంచం కూడా మారలేదు. అలాగే ఉంది. అప్పటిలాగే ఉంది.
ఎడమవైపు గోడకి పెద్ద కిటికీ, మూసి ఉంది. కిటికీ వద్దకెళ్లి నిల్చున్నాను. కిటికీ తలుపుల సందుల్లోంచి చల్లటి మంచుతెరలా, చల్లటిగాలి చొచ్చుకు రావడానికి ప్రయత్నిస్తూ… సూదుల్లా గుచ్చుతూ ఉంది. చలనరహితంగా మూసి ఉన్న కిటికీ తలుపులనే చూస్తూ నిల్చున్నాను. ఆ కిటికీకి అవతల ఆరు గజాల లోతులో ఏముం టుందో నాకు తెలుసు. తెరిచే ప్రయత్నం చేయలేదు.
వెనకగా అలికిడి వినిపిస్తే తిరిగి చూశాను. అతను, వేడి నీళ్ల బకెట్‌ బాత్రూంలో పెట్టి వెనుదిరిగాడు. టీ కావాలని చెప్పాను. విని వెళ్లిపోయాడు. బ్యాగులోంచి టవలూ, సోపు తీసుకుని బాత్రూములోకి దూరాను.
వేడి నీళ్ల స్నానంతో కాస్త అలసట తీరినట్టనిపించింది. తల తుడుచుకుంటూ బయటికి వచ్చేసరికి టీ పాయ్‌ మీద టీ కప్పు పెట్టి ఉంది. పక్కనే బిస్కెట్‌ పాకెట్‌. ఆకలి లేదు. టీ తాగేసి లుంగీ జుబ్బా తగిలించుకుని రూంలోంచి బయటపడ్డాను.
వసారాలో ఓ మూలగా ముంగాళ్ల మీద కూర్చున్న అతను నన్ను చూసి లేచాడు. అతను నాతో మాట్లాడిన గుర్తు ఇప్పటివరకూ లేదు. ఇన్నేళ్లనించి అంతే, శూన్యంలోకి చూసినట్టు చూస్తాడు. కానీ అతని కళ్లలోని ఎరుపు ఈరోజుకీ అలాగే ఉంది.
ముందుకడుగేసాను. అతనక్కడే నిల్చుండిపోయాడు.
గేటు దాటి ఎడమవైపుకి తిరిగి నెమ్మదిగా నడవసాగాను, దూరాన పచ్చిక బయళ్లూ ముదురాకుపచ్చని కొండలూ, కుడివైపుకి దూరంగా వాగొకటి కదలికలు కనిపించకుండా మెల్లిగా జారుతోంది.
ఆ ప్రశాంత వాతావరణంలో, లోపల దాగి ఉన్న ఆ కాస్త బెరుకూ మాయ మైంది. శరీరం కొంచం శక్తి పుంజుకున్నట్టనిపించింది. అడవంతా సాయంకాలపు నీరెండలో అలౌకికంగా కనిపించింది. పొడవాటి పున్నాగచెట్ల పూలు సుగంధాలు పంచడానికి ఒళ్లు విరుచుకుంటున్నాయి. హాయిగొలిపే అద్భుతమైన అడవి పరిమళం చుట్టుముట్టింది. తనువుకీ, మనసుకీ బలం చేకూరినట్టయింది. అడవంతా దేనికో ఎదుర్చూస్తున్నట్టు, ప్రకృతంతా ఎవరినో ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేసుకుంటు న్నట్టు, అడవిలోంచి పక్షుల కోలాహలం వినిపించసాగింది. చలికాలం ఇంకాస్త తొందరగానే చీకట్లు అలుముకునే ఛాయలు కనిపిస్తున్నాయి. ఆలోచనల్లో పడి చాలా దూరం వచ్చినట్లున్నాను. వెనక్కి మళ్లాను.
గెస్ట్‌ హౌస్‌కి చేరుకునేటప్పటికి చిక్కని చీకటి అలుముకున్నది. వసారాలోని లైటు చీకటిని నిలువరించే ప్రయత్నంలో ఓడిపోయింది. చల్లటి గాలి రివ్వున వీయ సాగింది. చలి మెల్లిగా ప్రకృతినంతటినీ ఆక్రమించే క్రమంలో ఉంది.
నన్ను చూసి అతను తలుపు గొళ్లం తీసాడు. లోపలికి అడుగేసి అలసటగా కుర్చీలో కూర్చున్నాను. సమయం ఏడుగంటలు దాటి ఉంటుంది. గదిలోని నిశ్శబ్దం ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుంది. బయట చీకటి కీటకాల ధ్వని ప్రతిధ్వనిస్తూంది. గదిలో వెలిగించిన అగరొత్తుల మరిమళం సుడులు తిరుగుతున్నది.
బ్యాగులోంచి స్మిర్మ్‌ ఆఫ్‌ వోడ్కా బాటిల్‌ తీసి టీపాయ్‌మీద పెట్టాను. కాళ్లు చాచుకుని, రిలాక్సుడుగా కూచున్నాను.
అతనొచ్చి టీపాయ్‌ మీద వాటర్‌ బాటిలూ, కడిగి తుడిచిన రెండు గ్లాసులూ, కాసిని కోసిన నిమ్మకాయ చెక్కలూ, ఉడకబెట్టిన వేరుసెనగ కాయల ప్లేటూ పెట్టి వెళ్లాడు. మళ్లీ ఒక ప్లేటు మీద మరొక ప్లేటు బోర్లించి తీసుకువచ్చి మూలగా నున్న డ్రస్సింగ్‌ టేబుల్‌ మీద పెట్టాడు.
నాకు తెలుసు అందులో రాత్రి డిన్నర్‌కి సంబంధించిన చపాతీలూ, చికెనో లేక పప్పో లేక బంగాళాదుంపల కర్రీనో ఏదో ఉంటుందని, ఏదైనా నాకు ఓకే.
అన్నీ చకచకా సర్దేసి ఇక వెళ్తానన్నట్టు నిల్చున్నాడతను. తలూపాను.
అప్పటివరకూ భావరహితంగా ఉన్న అతని కళ్లు, వెళ్తూ అతను చూసిన చూపులో ఏవో కొత్త భావాలు ప్రకటించసాగాయి. నాకు అర్థం కాలేదు. తలుపు దగ్గరగా వేస్తూ బయటికి నడిచాడతను.
రెండు గ్లాసుల్లో వోడ్కా 90 ఎవ్‌ు.ఎల్‌ పోసి, నిమ్మకాయని పిండాను. తరువాత నీళ్లతో గ్లాసుల్ని నింపేసి సిప్‌ చేసి తనకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను.
ఇపుడో, ఇంకాసేపట్లో రావచ్చు తను. అతను వెళ్లిపోయాకే వస్తుంది ఎప్పుడూ.
ఒక్కోసారి మెల్లిగా చడీ చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ప్రత్యక్షమవుతుంది. ఒక్కోసారి హఠాత్తుగా మీద పడిపోయి భయపెట్టేస్తుంది. భలే అల్లరిది. ఆ అల్లరిని తట్టుకునే శక్తి కావాలి ఈ వయసులో,
లేచి వసారాలోకి వచ్చాను. దూరంగా గేటు మూసేసి ఉంది. ఎక్కడా అతని అలికిడి లేదు.
ఇంకా రాలేదేం తను. ఎప్పుడూ ఆవురావురంటూ వచ్చి వాలేది. ఇవ్వాళే మయ్యిందో! పున్నమి వెలుగులు అడవిని ఆక్రమించేసాయి. చల్లటి గాలులతో, పచ్చటి వాసనలతో, ప్రకృతంతా పండగ చేసుకుంటున్నట్టనిపించింది.
వెనక్కి తిరిగి గదిలోకి అడుగుపెట్టి శిలలా నిల్చుండిపోయాను.
మంచం మీద, తెల్లటి దుప్పటి మీద వెల్లకిలా పడుకుని ఉంది. నిశ్చేష్టుణ్ణ యిన నన్ను చూసి గలగలా నవ్వింది.
‘‘ఇక నేను రాననుకున్నారు కదూ? గండం గడిచిందనుకున్నారు కదూ?’’ పకపకా నవ్వింది.
తలుపులు దగ్గరగా వేసి వచ్చి కుర్చీలో బొమ్మలా కూర్చుండిపోయాను.
‘‘నేనిక్కడే ఉన్నానుగా… ఎలా వచ్చావు?’’ అడిగాను,
‘‘ఎప్పటిలాగే వచ్చాను, ఎప్పుడూ ఎలా వస్తానో మీకు తెలీదా?’’ ఫక్కున గది అదిరిపోయేలా నవ్వింది. నవ్వీ నవ్వీ అలిసిపోయింది. తన గుండెలు ఎగిసిపడు తున్నాయి. ఇక నవ్వలేనన్నట్టు సైగ చేస్తూ వచ్చి నా ఎదురుగానున్న కుర్చీలో కాళ్లు పైకి లాక్కుని కూర్చుని చీరని పాదాల పైకి లాక్కుంది.
కళ్లతోనే తనకెదురుగా ఉన్న నిండు గ్లాసుని చూపించాను.
‘‘అవన్నీ నాకు పడవులే సారూ. చెప్పండి ఎలా ఉన్నారు? ఏవిటి విశేషాలూ?’’ అడిగింది.
నేను పెదవులు సాగదీసాను. ముందున్న గ్లాసు తీస్కుని గడగడా మొత్తం ఒక్క గుక్కలో తాగేసాను.
‘‘నెమ్మది… నెమ్మది. మరీ అంత తొందరయితే ఎలా? గబుక్కున మొత్తం తాగేసి మత్తుగా పడుకోవడానికా ఇంత దూరం వచ్చింది. ఈ రాత్రి మిమ్మల్ని పడుకోనివ్వనని తెల్సుకదా!’’ కన్ను గీటి నవ్వుతూ అంది.
మెల్లిగా లేచి వెళ్లి బ్యాగులో నుంచి రెండు బి. పి. ట్యాబ్లెట్లూ, రెండు షుగర్‌ ట్యాబ్లెట్లూ వేస్కుని బాటిలెత్తి గడగడా నీళ్లు తాగేసాను.
‘‘మెల్లిగా, మెల్లిగా. ముందు మీరు హాయిగా సేదతీరండి,’’ ఆదుర్దాపడింది.
తన గొంతులో ఆందోళన ధ్వనిస్తున్నా… కళ్లలోని కొలుముల వేడి నాకు తగుల్తూనే ఉంది.
ఇంకో పెగ్గు కలుపుకున్నాను. మెల్లిగా తలెత్తి తన వంక చూసాను.
నిజంగా ఎంతందం తనది.
మొదటిసారి సరిగా చూడలేదు కానీ, తరువాత్తరువాత తరచి చూస్తే కాని తెలీలేదు. చప్పిడి ముక్కుతెమ్మెలు. రెండింటికీ పుడకలు, వాటి మధ్య పోగు ముద్దలా ఉంటుంది. ముద్దుగా ఉంటుంది. చిన్న కళ్లు. చీకటి రంగు పులుముకున్న కళ్లు. ఆశలు పురిగొల్పే కళ్లు.
రెండు కనుబొమల మధ్యా… చివరా పచ్చబొట్లు, నుదుట పావలా కాసంత ఎర్రటి బొట్టు. వత్తుగా నూనె రాసుకుని పాపిట తీసి దువ్వుకున్న జట్టు. ఎడమ చెవి మీదుగా కట్టుకున్న కొప్పు. దాంట్లో తురుముకున్న అడవి పూలు. విరబూసిన ప్రకృతిలా ఉంటుంది. ప్రకృతి అంటేనే నలుపు రంగు. తనదీ నలుపే ప్రకృతిలా. నలుపులో ఇంత మెరుపు ఉంటుందని తనని చూసాకే తెలిసింది. ప్రకృతిని చూసి మైమరిచిపోని దెవరు? అందులో లీనమవ్వాలనేగా అందరూ కోరుకునేది. తనివితీరా ఐక్యమవ్వాలనే కదా ప్రయాణాలు చేసి తన ఒడిలో సేద తీరే మార్గాలను అన్వేషించేది.
ఎంత అందంగా ఉంటుంది. సృష్టిలోని ఏ పూవునైనా తన రంగుతో పోల్చ గలమా? పూవులెంత పాపం చేసుకున్నాయి. ఆ నలుపు రంగుకు మెరుపులతో మెరుగులు దిద్దినట్లు, ఎంత ప్రకాశవంతమైన నలుపు. ఇన్నాళ్లనించీ చూస్తూ ఉన్నా తన వయసెంతుంటుందో ఇదమిత్థంగా తేల్చుకోలేకపోతున్నాను. పదహారూ పద్దెనిమిదీ మధ్య ఖచ్చితంగా ఉంటుంది. ఆమె బుగ్గలపైని నునుపే తన వయసును నిర్ధారిస్తూ ఉంది.
‘‘ఏవండీ. ఎక్కడ తేలిపోతున్నారు, నేను మీ ముందుండగా ఆలోచనల్లోకి జారే అనుమతి లేదు ఇవ్వాళ,’’ ఆజ్ఞ జారీ చేసి కిలకిలా నవ్వింది.
నిశ్శబ్దంగా నిండుగా ఉన్న గ్లాసు వంక చూడసాగాను.
‘‘మీ స్నేహితుడు కనిపించాడా? నిజం చెప్పండి. నాకతన్ని ఒకసారి చూడాలని వుంది. పాపం?’’ కళ్లు చికిలించి చిలిపిగా నవ్వుతూ అంది.
మొట్టమొదటిసారి ఆమెని కలిసినపుడు నా ఫ్రెండూ నేను ఉన్నాము. ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో రైల్లో పడుకుని తెల్లవారాక చూస్తే… లేడు. తప్పి పోయాడని ఎక్కడెక్కడో వెదికాము. ఇన్నేళ్లయినా అతని జాడ మాత్రం తెలియలేదు. తెలుస్తుందన్న నమ్మకమూ లేదు. మనం చేసిన పనులకి ఫలితం కోసం ఎన్నాళ్లో ఆగాల్సిన అవసరం లేదు, కొన్నింటికి వెంటనే ప్రతిఫలం లభిస్తుంది. సాక్షీభూతమై, ప్రేక్షక పాత్ర పోషించినందుకు మూడున్నర దశాబ్దాల మానసిక శిక్ష సరిపోతుం దనుకోను.
నేను మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ మందు సిప్‌ చేసాను. రుచి మారింది. నిమ్మకాయ బద్దని కొద్దిగా గ్లాసులో పిండాను.
ఆమె చూపుల వాడి నాకు తెలుస్తూనే ఉంది.
‘‘ఏంటి సారూ! ఇన్నేళ్లయినా మీరు మారలేదు. క్షణక్షణానికీ మధ్య ఎక్కడికో జారుకుంటూంటారు?’’ బి.పి. ట్యాబ్లెట్లు పనిచెయ్యడం ప్రారంభించినట్టున్నాయి. కాస్త తేరుకున్నాను.
‘‘ప్రతి సంవత్సరం ఆడవాళ్ల మీద అప్పటివరకూ జరుగుతున్న అరాచకాలను చెపుతున్నారు కదా, మరి ఈ సంవత్సరంలో అలాంటి సంఘటనలేం లేవా?’’
ఉన్నాయి అన్నట్టు తలాడించాను.
‘‘మొదలుపెట్టండి మరి!’’
నేను మొదలుపెట్టాను. నాకు గుర్తున్నంత మేరా చెప్పసాగాను. కళ్లు నేలలోకి పాతేసి ఏకరువు పెట్టసాగాను. కళ్లు ధారాపాతంగా కురుస్తూనే వున్నాయి. కళ్లకి నీటి తెరలు అడ్డువచ్చినా, గొంతు దుఃఖంతో పూడుకుపోతున్నా, చేతుల్లో శక్తి నశించినా, చెపుతూనే వున్నాను. మందు మొత్తం అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకం తెచ్చుకుంటూ, గుండెలు ఉగ్గబట్టుకుని దేశవ్యాప్తంగా మగవాళ్లు అమ్మాయిలపై చేసే అకృత్యాలని, మనసును తునాతునకలు చేసే సంఘటనలను చెపుతూనే ఉన్నాను.
ఎన్ని చెప్పినా ఇంకా… ఇంకా… చెప్పాల్సినవి మిగిలే ఉన్నాయి. అప్పుడే అయిపోయే సంఘటనలా! నావంటి మగ రాక్షసుల చేతుల్లో నలిగిపోయే అమ్మాయిల లెక్క అంత తొందరగా తేలుతుందా? ప్రతి పదిహేను నిమిషాలకీ ఒక రేప్‌ జరిగే దేశంలో ఉన్నాము. సంవత్సరం సంఘటనలు చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి, ఎన్ని రాత్రులు కావాలి, కళ్లల్లో ఎన్ని సముద్రాలు పొంగాలి?
కళ్లు తుడుచుకుంటూ చెపుతూనే ఉన్నాను… చెపుతూనే ఉన్నాను.
తెల్లవారిపోయిన సంగతెప్పుడో తెలిసింది. చెప్పడం ఆపి తలెత్తి చూసాను.
తను లేదు. గబుక్కున లేచి తలుపులు తీసుకుని బయటికి వచ్చాను.
అతను తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని వాటికి చూపులు కట్టేసి నిల్చున్నవాడు నా వంక చూసాడు.
నేను వేగంగా బయటికి నడిచాను. అతను గభాలున గదిలోకి దూరి నా బ్యాగు అందుకుని నా వెనక నడిచాడు.
ఆ తెల్లవారుజామున నన్ను బస్సు ఎక్కిస్తూ కళ్లతో వీడ్కోలు పలికాడు. జుబ్బాలో చేయి పెడితే ఎన్ని డబ్బులు వచ్చాయో తెలీదు. అన్నీ అతని చేతిలో కుక్కాను. నా చేతిలో చేయి వేసి ఈ ముప్పై అయిదేళ్ల నించి నోరు తెరవని అతను మొట్టమొదటిసారిగా నోరు విప్పాడు.
‘‘మీకు ఇక్కడికి రావాలనిపించదు, తనని కలుసుకోవాలనిపించదు, మాట్లాడా లనిపించదు, చూడాలనిపించదు. కానీ, ఆమె కేవలం మీకే కనిపిస్తుంది, జరుగుతున్న అరాచకాన్ని ఆపే శక్తి ఉండీ, ఆపలేకపోవడమే మీరు చేసుకున్న పాపం. నాకు ఆమెని ఒక్కసారైనా కళ్లనిండా చూసుకోవాలని ఉంటుంది. మాట్లాడాలని ఉంటుంది. నేనింకా తనని మరిచిపోలేదని చెప్పాలని ఉంది, తన ముందు తనివితీరా ఏడవాలనిఉంది. నాకు కనిపించదు. నేను చేసిన పాపమా? ఆడవాళ్లమీద మగవాళ్ల అఫూయిత్యాలు ఆగవు, మీకు విముక్తి లభించదు. మీరు బతికి ఉన్నన్ని రోజులూ ఈ చిత్రవధ అనుభవించక తప్పదు.’’
నా మీద నిప్పులు కురిపించాల్సిన కళ్లు, నన్ను చూపులతో నిలువునా భస్మం చేయాల్సిన కళ్లలో నాకు కనిపించిన భావం చూసి ఒళ్లు గగుర్పొడిచింది.
అతని కళ్లలోని భావం నన్ను మరుగుజ్జుని చేసింది.
అది ‘జాలి.’

కొట్టం రామకృష్ణారెడ్డి 24 ఆగస్టు, 1969న రంగారెడ్డి జిల్లా ఘట్‌పల్లిలో జన్మించారు. వీరి మొదటి కథ తీర్పు రచన మాసపత్రికలో ఫిబ్రవరి, 1994లో అచ్చయింది. దాదాపు 15 కథలు రాశారు. మానవ సంబం ధాలు, వాటి చుట్టూ అల్లుకున్న భావోద్వేగాలు ఇష్టమైన ఇతివృత్తాలు.
చిరునామా: 17-1-382/పి /123, గవర్నమెంట్‌ ప్రెస్‌ కాలని, చంపాపేట్‌, హైదరాబాద్‌ – 500 059.
ఫోన్‌ : 924 6565 824 తీసతీసశ్‌్‌ీaఎఏస్త్రఎaఱశ్రీ.షశీఎ

నేనూ, పి.వి.శివం

  • డా|| వి. చంద్రశేఖరరావు

పదకొండు గంటలకి ఫోన్‌ వచ్చింది. ‘మీ నాన్న,’ అంటూ మొదలు పెట్టింది ఫోన్‌లోని అమ్మాయి. ‘పి.వి. శివం,’ అన్నాను నేను. ఈ పి.వి.శివాలు ప్రత్యేకమైన కేటగిరి మనుషులు. కాలం చెల్లిన ఆదర్శాల కొయ్యగుర్రాలపై ఇప్పటికీ ఊరేగుతుం టారు. ప్రతీదీ వ్యాపారమైన కాలంలో వీళ్లు సమా జానికి ఎక్సెస్‌ లగేజి లాంటివాళ్లు.
‘‘ఆయన హాస్పిటల్లో ఉన్నారు, సెయింట్‌ జోసెఫ్‌లో.’’ మృదు వైన కంఠస్వరం.
‘‘ఎవరు,’’ అన్నాను నేను. ఎవరి గురించి అయినా వివరాలు తెలీ కుండా రిలేషన్‌షిప్‌లోకి వెళ్లడం ఇష్టంలేదు నాకు. అవన్నీ నా రూల్స్‌ ఆఫ్‌ ది గేవ్‌ు.
గుంటూరులో ఒక పౌర సన్మానం కోసం వచ్చాడు పి.వి. శివం. అరవైల్లో గుంటూరు మున్సిపాలిటీకి వైస్‌ ఛైర్మన్‌గా చేశాడు ఆయన. నగరానికి ఎన్నో అద్భుతాలు చేసిన మనిషిగా చెప్పుకుంటారు. టౌన్‌ డెవెలప్‌మెంట్‌ కోసం తన భూమిని సైతం అమ్మాడు అని చెప్పు కుంటారు.
రాత్రి అమ్మ ఫోన్‌ చేసింది. ‘ఆయనకి తోడుగా వెళ్లు. నెల క్రితమే స్ట్రోక్‌ వచ్చిన మనిషి,’ అంది. ట్రైన్లో కానీ, దిగిన తరువాత కానీ, ఆయన నాతో రావడానికి ఇష్టపడలేదు. తన ట్రాలీ బ్యాగ్‌ను తానే లాక్కుంటూ ఒక్కడే టాక్సీలో హోటల్‌కి వెళ్లాడు. ఆయన దిగిన అదే హోటల్‌లో నేను ఇంకో రూములో చేరాను. ధనపిశాచి, ఫాలెన్‌ ఏంజెల్‌ అంటూ నా గురించి అందరికీ చెప్తాడు ఆయన.
రియల్‌ ఎస్టేట్‌, కార్ల వ్యాపారం- కోట్ల టర్నోవర్‌ నాది. నాలుగు కార్లు, జూబ్లీ హిల్స్‌లో పెద్ద బంగ్లా. ఈయన మాత్రం నాకు దూరంగా సికింద్రాబాద్‌, మారుమూల ప్రాంతంలో ఒక బేకరీ పెట్టుకొని కేకులు అమ్ముకొని బ్రతుకు తుంటాడు. పేరుకి బేకరీయే కాని… దాని నిండా వందలాది పుస్తకాలు. కేకులు తింటూ, టీ తాగుతూ ఒక పుస్తకాన్ని చదువుతూ ఆయనలాగే కాలం విలువ తెలియనివాళ్లు అక్కడ మూగుతుంటారు. సాయంకాలం వేళ ఈయన లాంటి ఓల్డ్‌ టైమర్స్‌ అక్కడ చేరుతారు. ఒక కాలపు కలల గురించి, వినియోగం లేని సమాజ సూత్రాల గురించి మాట్లాడుకుంటూ, మళ్లీ ఒక గొప్ప కాలం వస్తుంది, ఈ స్వప్నం నిజం అవుతుంది అంటూ తీర్మానించుకొని…
హాస్పిటల్‌ బయట ఒక చురుకు కళ్ల అమ్మాయి, ‘‘నేను భాను,’’ అంటూ చేయి చాపింది. హలో అంటూ లోపలికి నడిచాను.
నీరసంగా ఉన్నాడు ఆ మనిషి. తెల్లటి గుబురు గడ్డం, తలపై మిగిలిన కొద్దిగా తెల్లజుట్టుతో శిశువుల ముఖంలో కనబడే గొప్ప సౌందర్యం ఆయన ముఖంలో… ఫుట్‌బాల్‌ మ్యాచ్లు, కోరీÄ బుక్‌స్టాల్స్‌, ఛాయి బిస్కట్లు, ట్యాంక్‌ బండ్‌ పై రన్నింగ్‌ రేసు, వుండుండి ఒక్క సారిగా శ్రీశ్రీ అనే కవి రాసిన కవితలను పెద్దగా పాడటం, మిత్రు లందరి మధ్య, ‘వీడు నా లెనిన్‌’ అంటూ నన్ను పరిచయం చెయ్యటం.
‘‘ఏమైంది,’’ అన్నాను, ఆ మెరుపు కళ్ల అమ్మాయితో.
‘‘ఉదయం మా ఇంటికి వచ్చాడు. హనుమయ్య మాస్టారు ఇంటికి తీసుకువెళ్లమని మెట్లు దిగుతూ జారిపడ్డాడు.’’
హఠాత్తుగా ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ, ‘‘మీరు ఏం చేస్తుంటారు?’’ అన్నాను.
చురుకుగా గంభీరంగా నా వైపు చూస్తూ, ‘‘ఐ యావ్‌ు ఎ సెక్స్‌ వర్కర్‌,’’ అంది.
‘‘జోక్‌ చేస్తున్నారా?’’ అన్నాను.
ఆ అమ్మాయి నిర్లిప్తంగా చూసింది. ‘‘ఐ ఆవ్‌ు ఫేమస్‌ విత్‌ ఏజెడ్‌ కస్టమర్స్‌. కానీ ఈ పెద్దాయన, హి టచ్డ్‌ మై హార్ట్‌,’’ అంది ఎటువైపో చూస్తూ.
ఆ అమ్మాయి బయటకి వెళ్లిన సమయంలో ఆయన దగ్గరికి వెళ్లి, ‘‘ఏమిటిది ఇట్లాంటి మనిషితో,’’ అన్నాను నిరసనగా.
‘‘ఆ అమ్మాయి నా ఫ్రెండ్‌,’’ అన్నాడు పి.వి. శివం.
‘‘ఇట్లాంటి బిచ్‌తో,’’ ఉక్రోషం పట్టలేక పెద్దగా అరిచాను.
కళ్లలో నిప్పులు రాలుస్తూ ఈడ్చి నా చెంపపై కొట్టాడు పి.వి. శివం. ‘‘గెట్‌ లాస్ట్‌, నువ్వు ఒక మృగానివి,’’ అంటూ బయటకి చేయి చూపించాడు. ఆరోజు అంతా హాస్పిటల్‌ మెట్లమీదే గడిపాను.
2
ఆ మరుసటి రోజు ఆయన్ని తీసుకొని హోటల్‌కి వెళ్లాను. కానీ ఆయనతో పాటు తన గదిలో ఉండడానికి ఒప్పుకోలేదు. మధ్యాహ్నం, ‘‘కాస్త విస్కీ తాగాలని ఉంది,’’ అని కోరాడు. రెండు మూడు పెగ్గుల తర్వాత బిగుసుకున్న తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. ఆయన జ్ఞాపకాలను ఒక్కొక్కటి బయటకు తీస్తున్నాడు. యూనివర్సిటీ రోజులు, అమ్మతో పరిచయం, పేలవమైన శ్రీశ్రీ మార్కు కవితలు.
‘‘అప్పట్లో సోవియట్‌ సాహిత్యం గురించి మాట్లాడుకోవటం ఎంతో ఇష్టంగా ఉండేది. మీ అమ్మకి గోర్కి అంటే ఇష్టం. నాకు మాత్రం చెహోవ్‌, దోస్తావ్‌ యెస్కీ అంటేనే ఇష్టం. మీ అమ్మ ఎప్పుడూ ఒక గోర్కి పుస్తకంతోనే ప్రత్యక్షం అయేది. మీ అమ్మను నేను ఇష్టంగా నటాషా అని పిలుచుకునేవాడిని.’’ ఆయన మరో రెండు పెగ్గులు తీసుకున్నాడు. గాఢమైన తాత్వికగాథలా మారిపోయాడు. చిన్న చిన్న శకలాలుగా అక్కడ ఇక్కడ పడివున్న దృశ్యాలన్నీ బయటకి తీస్తున్నాడు.
‘‘ఇది నా ముఖం, ఇది నా పోరాటం. ఇదిగో ఇక్కడ పరిచిన ఇదంతా నా జీవితం. ఇదిగో బహుశా ఇదే నా మరణం. ఎందుకు ఎట్లా ఎప్పుడు అని ఎనలైజ్‌ చేసుకోలేదు. X ష్ట్రaఙవ అశ్‌ీ శ్రీఱఙవస ఱఅ ఙaఱఅ,ఁ అట్లా కబుర్లు చెబుతూ మంచంపైన పడిపోయాడు ఆయన.
రాత్రి పది గంటల సమయంలో తలుపు మీద శబ్దం. ‘‘ఒక చోటకి వెళ్లాలిరా,’’ అంటూ నాకు ఆర్డర్‌ వేసి బయటకు నడిచాడు. ఎక్కడికి అన్నట్లుగా చూశాను. ‘‘ఆత్మహత్య చేసుకున్న ఒక కవి ఇంటికి వెళ్దాం,’’ అని అన్నాడు. నాకు చిరాకు వేసింది.
‘‘వాడికి మనకి సంబంధం ఏమిటి. వాడెవడో సూసైడ్‌ చేసు కుంటే మనం ఎందుకు వెళ్లటం,’’ అని అన్నాను.
పి.వి. శివం నాకేసి జుగుప్సగా చూసి ఒక్కడే హోటల్‌ బయటకి నడిచాడు. విధిలేక నేను ఆయన వెంట నడిచాను.
ఒకే గది ఇల్లు. ఆత్మహత్య చేసుకున్న రాజు అనే కవిది. ఒక అమాయకమైన పల్లెటూరి మనిషి బయటకు వచ్చింది ఎవరు, ఏమి కావాలి అంటూ. పి.వి. శివం లోపలికి నడుస్తూ ప్రేమగా ఆ పిల్ల తల నిమిరాడు. లోపలికి వెళ్లి ఒక చిన్న బల్లపై కూర్చున్నాడు. ఆవిడ పేరు రేణుకాదేవి. చూస్తుండగానే పి.వి. శివం, ఆ అమ్మాయితో ఒక దుఃఖపు గాథను పంచుకోవటం మొదలుపెట్టాడు.
ఆ చిన్న గదిలో ఉండాలి అంటే నాకు అనీజీగా ఉంది. ఇల్లు కాదు, మినేచర్‌ అడవిలా ఉంది. దుప్పి కొమ్ములు, పలచటి దరువు, మట్టిబొమ్మలు, భీకరంగా చూసే అడవి దేవతల రూపాలు… అదేదో పురాణకాలపు సెట్టింగ్‌లాగా ఉంది. ఆ చనిపోయిన మనిషి భార్య మరీ అమాయకురాలిలా పల్లెటూరు దేవతలా ఉంది. రెండు ఏళ్ల కొడుకు ఒక మూలన పడుకొని వున్నాడు. కనపడని మరణం ఏదో నన్ను భయానికి గురి చేసింది. ఆ ఆత్మహత్య చేసుకున్న మనిషి మళ్లీ ప్రత్యక్షం అవుతాడేమో అనిపించింది. ఉరుములు, మెరుపులు, ఆకాశం చీలిపోవటం, ఎరుపు రంగు కలలు, సమాధులు చీల్చుకొని డప్పులు కొమ్ముబూరా, ఒక యుద్ధనాదంతో అతను మళ్లీ ప్రత్యక్షం కాబోతున్నాడు అనిపించింది. గంట గడిచినాక ఆయన మెరుపు కళ్ల భానుకి ఫోన్‌ చేశాడు. భాను పొడవాటి కారియర్‌, పళ్లు ఫలహారాలతో ప్రత్యక్షం అయ్యింది. ఆ దృశ్యం నాకు ఎందుకో సినిమాటిక్‌గా అనిపిం చింది. పి.వి. శివం అన్నం ముద్దలు కలిపి ఆ అమ్మాయికి తినిపిం చడం, నిద్రలేపి పసివాడికి రెండు ముద్దలు తిన్పించడం- ఇదంతా ఒక సెంటిమెంటల్‌ ట్రాష్‌గా అనిపించింది. ఈ రాత్రికి ఇక్కడే పడు కుందాం అంటూ ఆయన డిక్లేర్‌ చేశాడు. పి.వి. శివం, భాను అక్కడే ఆ ఇరుకు గదిలో పడుకున్నారు. నేను బయట టాక్సీలో కాలక్షేపం చేశాను. నా లాజిక్‌కి ఏ మాత్రం అందని మనిషి ఈ పి.వి. శివం. మరుసటి రోజు ఉదయాన్నే అక్కడ నుంచి బయలుదేరుతూ వెళ్లే ముందు ఒక చెక్కును ఆ ఆడమనిషి చేతుల్లో పెట్టాడు.
పొద్దున్నే పి.వి. శివం అమరావతి వెళ్దామంటూ బయలుదేర దీశాడు. ఆయన చిన్ననాటి మిత్రుడు హనుమయ్య ఆచూకి తెలిసిందని, అమరావతిలో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో వున్నాడని భాను కనిపెట్టింది. ఇన్నోవా కారు కోసం మిత్రుడికి ఫోన్‌ చేశాను. వద్దు, బస్‌కి వెళ్దామంటూ మొండికేశాడు. బస్టాండులో భాను ఎదురు చూస్తుంది. బస్సంతా ఖాళీగా ఉంది. బస్‌లో ఒక నడికారు ఆడమనిషి. ఆడమనిషి ఒళ్లో కూర్చున్న నాలుగేళ్ల ఆమె కొడుకు. నల్ల బంగారంలా ఉదయపు ఎండలో ఆడమనిషి మిలమిలలాడుతోంది. పొలాల్లో తరచుగా ఎదురయ్యే భూమిపుత్రికలా ఉంది. చేతులు బలంగా ఇనుప చేతుల్లా ఉన్నాయి. రష్యన్‌ కథలో కనపడే పాత్రలా ఉందావిడ. ఉదయమే కానీ ఉక్కపోస్తుంది. ఆమె నల్లటి రగ్గు కప్పుకొని ఉంది.
పి.వి. శివం పలకరింపుగా, ‘‘ఇంత ఉక్కపోతలో కూడా రగ్గు కప్పుకున్నావే,’’ అన్నాడు. ఆమె పట్టించుకోకుండా బస్సు బయటకి చూస్తుంది. ‘‘సెప్టెంబరు నెలలో కూడా ఇంత ఉక్కగా ఉందే,’’ అన్నాడు పి.వి. శివం ఆమె వైపు చూస్తూ.
ఆమెను గట్టిగా కరుచుకుని కూర్చున్న పిల్లవాడు లేచి వాళ్లమ్మ సంచిలోంచి సెల్‌ఫోన్‌ తీశాడు. పాట పెట్టు అంటూ సెల్‌ఫోన్‌ ఆమె చేతిలో పెట్టాడు. ఆమె తన ఒంటి మీద రగ్గును పిల్లవాడి చుట్టూ కప్పి సెల్‌ఫోన్‌ నొక్కింది. ‘భూమి మనదిరో, ఈ భూమి మనదిరో…’ గద్దరు పాట పెద్దగా వినపడింది. కుర్రవాడు లేచి పాటకు అనుగుణం గా చిందులేస్తున్నాడు. నేను ఉలిక్కిపడ్డాను. పి.వి. శివం మరొకసారి ఆమెతో మాటలు కలపడానికి ప్రయత్నించాడు, ఆమె పట్టించు కోలేదు. కుర్రవాడు ఇంకా గద్దరు పాటకు చిందులేస్తునే వున్నాడు. ఆమె తన బొడ్డులో ఉన్న గుడ్డసంచి బయటకు తీసింది.
‘‘ఏదైనా ఉద్యమంలో పని చేస్తున్నావా?’’ అన్నాడు పి.వి. శివం.
ఆమె పట్టించుకోలేదు. గుడ్డ సంచిలోంచి ఆకు, వక్క బయటకు తీసి దానికి కొంచెం పొగాకు ముక్కను కలిపి దానిని నోట్లో వేసుకుంది. కిటికీలోంచి బయటకు చూస్తూ తూ అంటూ ఊసింది పెద్ద శబ్దంతో. ఆమె ముఖంలో ఏదో కోపం, కసి, నిరసన తోచాయి. అన్నివైపుల నుంచి ఉదయపు ఎండ. బస్సులో మేం ముగ్గురం, ఆడ మనిషి, పిల్లవాడు తప్ప ఇంకెవరు ఎక్కలేదు. కండక్టర్‌ బస్‌ ఎక్కాడు. తన సీట్లో కూర్చుని టిక్కెట్‌ తీసుకోండి అని అరిచాడు. పిల్లవాడు వెళ్లి 50 నోటు ఇచ్చి రెండు టిక్కెట్లు అన్నాడు. సీటు క్రింద ఉన్న గొర్రెపిల్లకి కూడా తీసుకో అన్నాడు కండక్టర్‌. సీటు క్రింద బుజ్జి గొర్రెపిల్ల ఇప్పుడే తల్లి కడుపు నుంచి బయటకు వచ్చినట్లు లేతగా పచ్చిగా ముద్దుగా, ముదురు గోధుమ రంగులో వుంది. సీటు క్రింద సన్నటి త్రాడుతో కట్టేశారు దాన్ని. దానికి కూడా టిక్కెట్‌ ఇచ్చాడు కండక్టర్‌. ఇప్పుడు ఆ తల్లి ఒడిలో కుర్రాడు. కుర్రవాడి ఒడిలో గొర్రెపిల్ల.
బస్‌ బయలుదేరింది. విశాలమైన రోడ్లు, లేటెస్టు కార్లు, పొలిటీ షియన్ల కటౌట్లు, గుంటూరు తన రూపం మార్చుకుంటుంది. రోడ్డు పొడవునా కొత్త కొత్త అపార్టుమెంట్లు, మాల్స్‌, మేకపిల్లలాంటి గుంటూరు పులిలా మారటానికి ప్రయత్నిస్తుంది.
కిటికీని ఆనుకొని పి.వి. శివం కునుకు తీస్తున్నాడు. బస్‌లో తల్లి, కొడుకుల కబుర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. పిల్లవాడు హఠాత్తుగా వాళ్ల అమ్మను మేకపిల్ల కథ చెప్పమన్నాడు. ఆ తల్లి పెద్దగా ఆలోచించకుండానే కథను మొదలుపెట్టింది. ఒక మేక, కాదు వందకు పైగా వున్నాయి. మేకల చుట్టూ ఇనుప కంచ వేశారు. పచ్చటి నేల. మిలమిల మెరుస్తున్న అటుప్రక్క కొండల దాకా పెరిగిన ఆకు పచ్చని నేల. ఆ ప్రదేశానికి వెళ్తే ఆ మేకలు మనవైపే చూస్తున్నట్లుం టాయి. ఆ మేకలు ఆ కంచలో ఎప్పటి నుండి వున్నాయో తెలియదు కాని అక్కడంతా ఉచ్చ కంపు, మేకల పెంటికల వాసన.
ఆ మేకలు పెద్దగా చప్పుడు చేయవు, అరవవు, అటూ ఇటూ పరిగెత్తవు. వాటికి కాపలాగా ఎవరూ ఉండరు. పొద్దున్నే గడ్డిపరకలను నములుతూ కనిపిస్తాయి. జాగ్రత్తగా గమనిస్తే మేకల కాళ్లకు నైలాన్‌ తాళ్లు కట్టి వుంటాయి. అవి చాలా పొడుగు తాళ్లు. మేకల కళ్లన్నీ దిగులుగా ఉంటాయి. ఏమిటీ- బ్రతుకు అన్నట్లుగా వుంటాయి.
ఆడమనిషి గొంతు ఖంగుమని మ్రోగుతుంది. ఈ కథ, ఈ బస్‌ ప్రయాణం- ఇదంతా విసుగ్గా వుంది నాకు. పి.వి. శివం మీద చెప్పలేని కోపం వేసింది. రోడ్డు పొడవునా కొత్తకొత్త నిర్మాణాలు. ఆ నిర్మాణాలు చూస్తే ఆశగా వుంది. కొత్త వ్యాపారాలు కొత్త అవకాశాలు భవిష్యత్‌ అంతా ఇక్కడే వున్నట్లనిపిస్తుంది. రాజధాని ప్రకటన వచ్చిన వెంటనే 50 లక్షలు ఇక్కడ ఇన్వెస్ట్‌ చేశాను. అవన్నీ రైతులు దగ్గర కొన్న భూములు. అవి గవర్నమెంటుకిచ్చి పూలింగ్‌లో కలిపి, రేపు కోట్ల మీద లాభాలొస్తాయి. ఆడమనిషి మేకల కథ చెబుతూనే వుంది. కథలో పులులు లేవు కాని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారు, బిల్డర్లు ఉన్నారు. ఆకుపచ్చ నేల మాయమైంది. బోను లాంటి కాంక్రీట్‌ ఇళ్లు. ఆ బోనులో మేకలు. వాటికి ప్రత్యేకమైన ఆహారం. బోనులోని మేకలు ఒక్కొక్కటి మాయమవుతున్నాయి. అవి పారిపోయాయో కబేళాకి వెళ్తున్నాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడక్కడ ఒక్క మేకే వుంది. అది బోనులో నుంచి బయటికి వచ్చి బిక్కు బిక్కుమంటూ చూస్తుంది. ఆడమనిషి కథ కొనసాగుతునే వుంది. వినే మూడ్‌ లేక నా సెల్‌ఫోన్‌లో పాటలు ఆన్‌ చేశాను.
పి.వి. శివం నిద్దర లేచినట్లున్నాడు, ఆ అమ్మాయితో కబుర్లు మొదలుపెట్టాడు.
అమరావతిని చూస్తూనే నాలో ఏదో హుషారు. ఇన్వెస్టర్ల స్వర్గం అక్కడ రాబోతుంది. అటూ ఇటూ ఎటు చూసినా అవకాశాలే. బస్‌ దిగుతూనే పి.వి. శివం ఆటోను పిలిచాడు. నేను కారులో వెళ్దామంటూ నసిగాను. బయట భయంకరమైన ఉక్కపోతా, ఎండా, శరీరమంతా చెమటలు. వృద్ధాశ్రమం ఊరి చివర నది ఒడ్డున వుంది. ఆటో దిగి అటువైపు నడుస్తుంటే నదిలో ఈదుతున్న నల్లటి గేదెలు, దున్నలు కనిపించాయి. తొమ్మిదో పదో వుంటాయి. నీటిలో మునిగి, స్నానం చేస్తున్నాయి. వాటి కొమ్ములు, ముట్టె మాత్రమే కనిపిస్తున్నాయి. వాటిలో నుంచి ఒకటి పైకి లేచి, అద్భుతమైన దృశ్యం. నల్లటి రాతి గేదెలా వుంది. భాను, శివం వాటివైపు నడిచారు. నది ఒడ్డున అడవి పూలచెట్లు ఏపుగా పెరిగున్నాయి. భాను ఆ గేదెవైపు వెళ్లి దేవతా మూర్తి ముందు తల వంచి నిలబడినట్లుగా క్రింద కూర్చొని రెండు చేతులు వాటి వైపు చాచి. పి.వి. శివం గట్టు పైన ఉన్న పచ్చగడ్డిని వాటిపై విసిరాడు.
పది గంటలయింది. ఎండ వేడి తట్టుకోలేనట్లుగా ఉంది. నా చేతిలోని బిస్‌లరీ బాటిల్‌లో నీళ్లు తాగి ఆ బాటిల్‌ని గేదెలవైపు విసిరాను. అది వెళ్లి ఒక గేదె కొమ్మును తాకింది.
అప్పటివరకు నీళ్లలో పడుకుని స్నానం చేస్తున్న ఆ గేదె ఒక్కటీ ఒక్కసారిగా పైకి లేచింది. తల విదిల్చి వాడియైన కొమ్మును కదిలిస్తూ హుంకరించింది. మిగిలిన గేదెలు కూడా నీళ్లలోంచి పైకి లేచాయి. మాపైకి దాడి చేయబోతున్నట్లుగా అన్నీ ఒక్కసారిగా ఒడ్డువైపు కదిలాయి. భయంగా అరిచాను. పి.వి. శివం, భాను ఆశ్రమం వైపు నడుస్తున్నారు. వెళుతూ వెళుతూ భాను వెనక్కి తిరిగి నావైపు చూసింది. ఆ ముఖంలో వుంది వెక్కిరింతా? జాలా?
పి.వి. శివం వెతుకుతున్న హనుమయ్య ఇప్పుడా వృద్ధాశ్రమంలో లేడు. ‘‘ఈ మధ్యకాలంలో చుట్టుప్రక్కల ఊళ్ల నుంచి ముసలి రైతులు కూడా వచ్చి ఆశ్రమంలో చేరుతున్నారు. వచ్చే విరాళాలు తగ్గిపోయాయి. అందుకే కొంతమందిని వాళ్ల ఇళ్లకు పంపాము. వాళ్లలో ఈ హనుమయ్య ఒకడు,’’ అంటూ ఆశ్రమం మేనేజరు చెప్పాడు. పి.వి. శివం ముఖంలో చెప్పలేని నిరుత్సాహం. చాలాసేపు ఆలోచించి తన సంచీలో నుంచి చెక్‌ బుక్‌ తీసి ఐదు లక్షల విరాళం ఆశ్రమం పేరుతో రాశారు.
‘‘హనుమయ్య మాస్టారుని వెనక్కి ఆశ్రమంలోకి పిలిపించండి. వాళ్లు మహానుభావులు. వాళ్లని అట్లా అనాథలుగా వదిలివేయద్దు,’’ అంటూ మేనేజరు వైపు చేతులు జోడించాడు.
తిరిగి బస్టాండ్‌ చేరాము. బస్టాండ్‌ గేటు ఎదురుగా ఒక షామియానా. టార్పాలిన్‌ పట్టాలతో వేసిన షామియానా. ఉదయం బస్‌లో కనబడ్డ ఆడమనిషి, ఆమె కొడుకు కూర్చుని వున్నారు. ప్రభుత్వం లాక్కున్న పట్టా నెంబరు 56/82ను తిరిగి ఇచ్చేయాలి అంటూ ఒక బ్యానర్‌ వుంది ఆ టెంట్‌లో. పి.వి. శివం షామియానా వైపు నడిచాడు. కాసేపు ఆమె పక్కనే మౌనంగా కూర్చున్నాడు. పిల్లవాడు సెల్‌ఫోన్‌ నొక్కి ఉద్యమం పాట వినిపిస్తున్నాడు.
పి.వి. శివం ఆ ఆడమనిషితో మాట్లాడుతుండగా ఎదురైన ఒక దృశ్యం నన్ను భయభ్రాంతుడను చేసింది. భయానకమైన కలలా నన్నాదృశ్యం చాన్నాళ్లపాటు వెంటాడింది.
వి.ఐ.పి. ఎవడో ఆ రోడ్డు మీద వెళ్తున్నాడు, ముందు ఓ నాలుగు, వెనుక ఓ నాలుగు కార్లు. పోలీసులు హడావుడి చేస్తున్నారు అన్ని వాహనాలను ఆపి. వాళ్ల కళ్లు రోడ్డు ప్రక్కన వున్న శిబిరం పైన పడ్డాయి. పదిమంది పోలీసులు శిబిరాన్ని చుట్టుముట్టి కర్రలనీ, టార్పాలిన్‌ను పీకి వేస్తుండగా ఆ ఆడమనిషి రుద్రకాళికలా మారి పెద్దగా అరుస్తూ, కేకలు వేస్తూ వాళ్లను ప్రతిఘటించింది. సరిగ్గా అప్పుడే ఆ సంఘటన జరిగింది. భయం గొలిపే ఒక దృశ్యం రోడ్డుపై ప్రత్యక్షమైంది. నది నీళ్లలో నిద్రిస్తూ సేదదీరుతున్న మహిషాల గుంపు, ఎవరో వాటిపై దాడి చేసి వెంటాడి రెచ్చగొట్టినట్లుగా మహా క్రోధంతో ఒక యుద్ధోన్మాదంతో రోడ్డుపై పరిగెడుతున్నాయి. ఆ దృశ్యమంతా ఒక యుద్ధ సన్నివేశాన్ని గుర్తు చేసింది. రోడ్డు పైన మనుషులందరూ భయంతో అటు ఇటు పరిగెట్టారు. కొమ్ముల ఆయుధాలతో ఆ మహిషాలు సమస్తాన్ని ధ్వంసం చేయటానికి వస్తున్నట్లుగా దూరం నుంచి చూస్తే రోడ్డుపై అవి మాత్రమే మహాక్రోధంతో బుసలు కొడుతూ. ఆ దృశ్యం చాలారోజులపాటు నన్ను వెంటాడింది.
3
ఆదివారం సాయంకాలం అవార్డు ఫంక్షన్‌. వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రం. గుంపులు గుంపులుగా ఈ పి.వి. శివం లాంటి ఓల్డ్‌ టైమర్స్‌ ఆ సభకు వచ్చారు. బయట చిన్న చిన్న సమూహాలుగా చీలిపోయి గతకాలపు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. హోటల్‌ నుంచి బయలు దేరుతున్న ఆయన ముఖం చుట్టూ ఒక కాంతి వలయం కనపడ సాగింది. సాయంకాలపు లేత ఎండ, శీతాకాలపు చల్లని గాలి, ఎండిన ఆకులపై పాదాల చప్పుళ్లు.
‘‘ఈ రోడ్లు అన్నీ నాతో మాట్లాడుతున్నట్లుగా ఉన్నాయి,’’ అన్నాడు పి.వి. శివం.
కారు వెనుక భాను, ఆమె ఎనిమిదేళ్ల కొడుకు ఉండడం నాకు నచ్చలేదు. ఈ ఒక్కరాత్రి గడిపేస్తే చాలు, ఈయన గురించి నా బాధ్యత తీరిపోతుంది అనుకున్నాను. సంవత్సరాలన్నీ కళ్ల ముందే కదులుతున్నట్టుగా వుంది. మనుషులు అందరూ వెనక్కు గతంలోకి అదృశ్యం అవుతూ మళ్లీ ప్రత్యక్షం అవుతూ… ఈ వీధులలో నేను జీవించాను. ఎ.సి. కాలేజీలో బి.ఎ. చేసిన రోజులు. ప్రొద్దున్నే సైకిల్‌ పై న్యూస్‌పేపర్లు ఇచ్చి రావటం. సాయంకాలం కవిత్వమో, నవలో పదిమంది కూర్చొని చర్చించుకోవటం. జీవితం అంటే మనుషుల మంచితనమే అని గాఢంగా నమ్మిన రోజులు. భీకరమైన సింహం లాంటి కాలానికి రొమ్ము చూపి నిలిపిన రోజులు. పి.వి. శివం కళ్లలో సన్నటి నీటి తెర.
ఫంక్షన్‌ హాల్‌కి చేరుతూనే వందలమంది ఆయన చుట్టూ మూగారు. ఆయనని భుజాల పైకి ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్లారు. పి.వి. జిందాబాద్‌ అంటూ పెద్ద పెద్ద నినాదాలు. బయట డప్పుల నాదాలు, శ్రావ్యమైన సన్నాయి పాటలు. అదేదో ప్రత్యేకమైన దేశంలా ఉంది. మనుషులు ఇంత ఉత్సాహంగా ఆనందంగా వుండటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన రెండురోజులుగా వెతుకుతున్న హనుమయ్య మాస్టారుగారి మనవడు ఆ సభకు వచ్చాడు. తాతయ్య రాసిన పుస్తకాలు అంటూ హనుమయ్య మాస్టారి కవిత్వ సంకలనాలు ఆ కుర్రాడు పి.వి. శివంకి ఇచ్చాడు. అపురూప మైన ఆస్తిలా వాటిని గుండెలపైన హత్తుకున్నాడు. పి.వి. శివం కళ్లలో నీరు. ఆ తరువాత మొదలైంది ఒక గొప్ప వేడుక. ఎవరెవరో మాట్లాడారు. రాసుకొచ్చిన ఉపన్యాసాలు కావు అవి. గుండెల్లో నుంచి ఉబికిన ఉద్వేగాల గాథలు అవి. చివరగా పి.వి. శివంను పట్టు శాలువా, గజమాలతో సన్మానించారు. పి.వి. శివం దేవతల మనిషిగా వెలిగిపోయాడు. ఆత్రంగా పట్టలేని ఆనందంతో గొంతు విప్పి మాట్లాడ బోయి, ‘మిత్రులారా, నా కామ్రేడ్స్‌, నాతోపాటు ఒక మధురస్వప్నాన్ని కంటున్న నేస్తాల్లారా,’ అంటూ మాట్లాడుతూ హఠాత్తుగా తట్టుకోలేని ఉద్వేగాల రాపిడికి నేలపై కూలిపోయాడు పి.వి. శివం.
స్టేజివైపు పరిగెత్తుకుంటూ వెళ్లాను. ఆయన మిత్రుడయిన డాక్టర్‌ ఒకాయన టెస్ట్‌ చేసి ప్రమాదం లేదు అని సర్టిఫై చేశారు. పి.వి. శివంని స్టేజిపై నుంచి కిందకి తీసుకొని వచ్చారు. ఆ తరువాత గంట సేపు పైగా బృందగానాలు, జానపద నాట్యాలు, పాటలు… ఆ హాలంతా గొప్ప ఆనందంతో వెలిగిపోతున్న దేవతల రాజ్యంలా ఉంది. సభ ముగిసింది.
ఒక్కొక్కరి దగ్గరికి నన్ను తీసుకువెళ్లి పరిచయం చేస్తున్నాడు పి.వి. శివం. ఈయన వాసుదేవరావు, మెడికల్‌ కాలేజి ప్రొఫెసర్‌, ఈయన లంక నారాయణ, గ్రంథాలయ ఉద్యమ నాయకుడు. అట్లా ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ వెళ్లాడు. ఒక మనిషిని చూడగానే ఆగిపోయి, ‘రా రా,’ అంటూ నన్ను లాక్కొని వెళ్లాడు.
‘‘ఈయన పులుపుల సార్‌, నాలో జ్ఞానదీపాలని వెలిగించిన దేవుడు.’’
ఆ మనిషి కాస్త అపరిచితంగా గుర్తుపట్టనట్టుగా నా వైపు చూశాడు. ‘‘సర్‌, నేను వాళ్ల అబ్బాయిని, ఆయన చనిపోయి ఇరవై ఏళ్లు కావస్తోంది,’’ అన్నాడు.
ఆడిటోరియం నుంచి బయటపడ్డాక, ‘‘అట్లా పేవ్‌మెంట్‌ మీద నడుద్దాం,’’ అన్నాడు. ఈ మురికి పేవ్‌మెంట్ల మీద ఏంటి అని ముఖం చిట్లించుకున్నాను. ఈరోజు పి.వి. శివంది, అతను ఏమి అడిగినా కాదనకూడదు అనుకుంటూ అతని వెనక నడవటం మొదలు పెట్టాను. మాతో పాటు భాను, ఆమె కొడుకు.
లీలామహల్‌ సెంటర్‌ దగ్గరికి వచ్చినాక, ‘‘ఇక్కడ బజ్జీలు బాగుంటాయి తిందాం?’’ అన్నాడు. నూనె కారుతూ ఉన్న ఆ బజ్జీలు ముట్టుకునే సాహసం చేయలేదు నేను. కాస్త దూరం వెళ్లాక, ‘‘ఇక్కడ టీ బాగుంటుంది,’’ అని ఒకచోట ఆగాడు. వాళ్లు ముగ్గురు అమృత పానంలా ఆ టీని తాగుతున్నారు. పేవ్‌ మెంట్లపైన నడవటం కూడా ఎంతో బాగుంటుంది అన్నాడు పి.వి. శివం.
బ్రహ్మాండమైన వెలుగు, ఎటు చూసినా మానవ సమ్మేళనం, వాళ్లందరూ మనల్ని రాసుకోవటం, మన లోపల నుంచి వెళ్తున్నట్లుగా. మనం నడుస్తుంటే మన పాదాల కింద గత సంవత్సరాలు అన్నీ ఒక్కొక్క జ్ఞాపకాన్నే చెప్పుకుంటూ.
పదకొండు గంటలు దాటినాక, ‘‘ఏదైనా బారుకు తీసుకెళ్లు,’’ అన్నాడు ఆయన. రెండు మూడు పెగ్గుల తరువాత ఆయన ఒక పాటని ఎత్తుకున్నాడు, జానపద గీతం. ‘బండిరా పొగ బండిరా…’ అంటూ, బారు మెల్లగా ఖాళీ అవుతుంది. లోపల పదిమంది కూడా లేరు. భాను ఒడిలో పిల్లవాడు నిద్రపోతున్నాడు. భాను మెల్లగా గొంతు విప్పింది. ఉర్దూ పాట. గజల్‌లాంటిదే. చాలా దుఃఖం ఉందా పాటలో… గొప్ప సుఖం కూడా ఆ పాటలో ఉంది. ‘మరో పాట మరో పాట,’ అంటూ భాను తోటి పది పాటలు దాక పాడించుకున్నాడు. ఆ పాటల మాధుర్యంలో తడిచి పి.వి. శివం చలించిపోయాడు.
‘‘నా తల్లి, నాతో హైదరాబాద్‌ వచ్చెయ్‌ రా. నా బేకరీలో పని చేద్దువుగాని,’’ అన్నాడు. ఆ అమ్మాయి ‘సరే’ అంటూ తల ఊపింది.
నాకు చిర్రెత్తుకొచ్చింది. ఈ మనిషికి సెనిలిటీ వచ్చింది. ఎక్క డెక్కడి లంపెన్ను తెచ్చి నెత్తిన పెట్టుకుంటున్నాడు అనుకొని ఒక్క సారిగా, ‘‘నీకు ఏమైనా మతిపోయిందా,’’ అని అరిచాను. ‘‘ఇలాంటి దాన్ని,’’ అని. నా అరుపులకు బారు అంతా ఉలిక్కిపడింది. భాను ముఖం తెల్లగా పాలిపోయింది.
పి.వి. శివం ముఖంలో ఎరుపు, కోపం. నా వైపు వేలు చూపించి, ‘‘ప్లీజ్‌ గెట్‌ లాస్ట్‌ ఫ్రం దిస్‌ ప్లేస్‌,’’ అని అజ్ఞాపించాడు.
4
వేకువజామున ఐదుగంటలకు తిరిగి హైదరాబాదు ప్రయాణం అయ్యాము, భాను ఆయనను ప్రేమగా హగ్‌ చేసుకుంది. తను చేసిన ఖీర్‌ చిన్న బాక్సులో పెట్టి ఆయనకి ఇచ్చింది. ఒక చెక్కు ఆ అమ్మాయికి ఇచ్చినట్లు నాకు అనుమానం. మెరుపు కళ్లతో ఆ అమ్మాయి గుడ్‌బై చెప్తుండగా కారు ముందుకు కదిలింది.
సన్నగా వెలుగులు మొలుస్తున్న సమయానికి మేము సత్తెనపల్లి దాటాము. ఒక పల్లెటూరుని దాటుతుండగా, నడికారు మనిషి రోడ్‌ దాటుతూ కనిపించాడు, ‘‘జాగ్రత్త స్లో చేసుకో,’’ అన్నాడు పి.వి. శివం. ఆ మనిషి తాగి ఉన్నాడేమో తూలుతూ నడుస్తున్నాడు. హఠాత్తుగా మధ్యలోకి వచ్చి ఆగిపోయాడు. వేగంగా వస్తున్న కారును స్లో చేసి అతని పక్కన నుంచి వెళ్తుండగా అతను కారువైపు కదిలాడు. కారు బ్రేక్‌ వేశాను. కానీ అతను తూలి కారు బాయ్‌నెట్‌ తగిలి రోడ్‌ పై పడ్డాడు. సన్నటి మూలుగు. పి.వి. శివం అతని వైపు పరిగెత్తాడు. అతన్ని పైకి లేపి నుదుటిపై కారుతున్న రక్తంపై కర్చీపు పెట్టి అతన్ని రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టు క్రిందకు తీసుకువెళ్లాడు.
రోడ్డు నిర్మానుష్యంగా వుంది. దూరంగా పొడవాటి యూకలిప్టస్‌ చెట్లు. ఆ చెట్లకు అవతల ఇరవైయో ముప్పయ్యో రేకుల షెడ్లు. ‘‘ఆ ఇళ్లలోని మనిషి అయ్యుం టాడు,’’ అన్నాడు పి.వి. శివం. రోడ్డు పని చేసే కార్మికుడై వుంటాడు అని కూడా అన్నాడు. 50 ఏళ్ల వయస్సుంటుంది అతనికి. అతని దగ్గర సారాయి వాసన గుప్పు మంటుంది.
‘‘వెళ్లిపోదాం ఎవరూ చూసినట్లు లేదు,’’ అన్నాను నేను. ‘‘మన తప్పేమీ లేదుకదా,’’ అని కూడా అన్నాను. పి.వి. శివం ఒప్పుకోలేదు. ‘‘ఏదైనా హాస్పిటల్‌లో చేర్చి వెళ్దాం,’’ అని పట్టుపట్టాడు. ఆ ఊరి పొలిమేర దాటినాక పిడుగురాళ్ల దగ్గరలో నర్సింగ్‌ హోవ్‌ు కనబడింది. పాతకాలపు బిల్డింగ్‌. ఆ మనిషిని అందులో చేర్చాము డాక్టరు లేడు. నర్సు ఒక్కతే వుంది. ‘‘ఇక వెళ్లాం పద,’’ అన్నాను. ‘‘లేదు నేను రాను. ఇక్కడే వుంటాను. డాక్టరు వచ్చేదాక, ఆ మనిషికి ఏమీ ప్రమాదం లేదు అని తెలిసేదాక కదిలేదు లేదు,’’ అన్నాడు పి.వి. శివం.
రెండు గంటల తరువాత డాక్టర్‌ వచ్చాడు. ఎక్స్‌-రే, స్కానింగ్‌ పరీక్షలు చకచకా జరిగిపోయాయి. అతనికింకా స్పృహ రాలేదు. సాయంత్రందాకా చూద్దామన్నాడు డాక్టర్‌. మందులు, సెలైన్‌ పెట్టాడా మనిషికి. ఆ మనిషి దగ్గరే చాలాసేపు కూర్చున్నాడు పి.వి. శివం. ఎండిపోయి ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి ఆ మనిషి శరీరంలో పెరిగిన గడ్డం, దువ్వని జుట్టు, శపించబడిన మనిషిలా వున్నాడు.
‘‘వీడా రెడ్డిగూడెంలో వుంటాడు తాగుబోతు వెధవ. వాడి ఇంట్లో వాళ్లను పిలిచి ఒక వెయ్యి పారేస్తే వాళ్లే ఊరుకుంటారు,’’ అంది నర్సు. పి.వి. శివం ఆమెకేసి కోపంగా చూశాడు.
12 గంటలకు డాక్టర్‌ మళ్లీ వచ్చాడు. ఆ డాక్టర్‌ కూడా పి.వి. శివంలాగా ఆదర్శాల కాలం మనిషి. పేషంట్స్‌ ఎవరూ లేరంటూ ఆ గదిలోనే పి.వి. శివంతో పాటు కూర్చున్నాడు. హెడ్‌ ఇంజరీల గురించి వాటి లక్షణాల గురించి ఒక పాఠంలా వివరిస్తున్నాడు. నాలుగు గంటలకు ఆ మనిషికి స్పృహ వచ్చింది. మూలుగుతూ అటు ఇటు కదిలాడు. డాక్టర్‌ మరి ఇంకేమీ పర్వాలేదు అన్నట్టుగా నిట్టూర్చాడు. స్పృహ వచ్చినాక ఆ మనిషి పెద్దగా కేకలు వేశాడు. ఎర్రనైన కళ్లు. ముఖమంతా కోపం.
‘‘ఈడే ఈ నా కొడుకే నన్ను కారుతో గుద్దింది,’’ అంటూ నావైపు చూస్తూ పెద్దగా అరిచాడు.
నేను అతని దగ్గరగా వెళ్లి అతని తలపై చెయ్యి వేసి, ‘‘హాస్పిటల్లో చేర్పించాను,’’ అన్నాను.
హఠాత్తుగా ఆ మనిషి రౌద్రమూర్తిలా అయి కాండ్రించి నా ముఖంపై ఊసి చెయ్యి పైకెత్తి నా గొంతువైపు చాచి, మహా కోపంతో నా చొక్కాని పట్టుకొని లాగాడు. నా చొక్కా పర్రుమంటూ చినిగింది. కొయ్యబారిపోయాను. భయంతో కోపంతో అక్కడి నుంచి బయటకు నడిచాను. నా వెనుకనే పి.వి. శివం కూడా నడిచాడు.
డాక్టర్‌కి థాంక్స్‌ చెప్పి హాస్పిటల్‌ బిల్లులన్నీ కట్టి వచ్చి కార్లో కూర్చున్నాడు పి.వి. శివం.
కారు స్టార్ట్‌ చేసినాక, ‘‘ఇదేదే భవిష్యసూచికలా వుంది కదా,’’ అన్నాడు పి.వి. శివం.
నా ముఖం ఇంకా అవమానంతో ఎర్రబడే వుంది.

డా|| వి. చంద్రశేఖరరావు 13 ఏప్రిల్‌ 1959న ప్రకాశం జిల్లాలో జన్మించారు. వీరి మొదటి కథ నైట్‌ డ్యూటీ 1990లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో అచ్చయింది. వందకుపైగా కథలు రాశారు. జీవని, లెనిన్‌ ప్లేస్‌, మాయలాంతరు, ద్రోహవృక్షం, చంద్రశేఖరరావు కథలు కథాసంపుటాలు, మూడు నవలలు ప్రచురించారు. రైల్వేలో ఉన్నత పదవిలో 2017 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు. 8 జులై 2017న మరణించారు.

AKSHRA
error: Content is protected !!